అన్నాడీఎంకేలో చీలిక, శశికళ జైలుకు వెళ్లడం.. పన్నీర్ వెలివేయబడటం.. పళని ప్రమాణ స్వీకారం వంటి చర్యలతో విసిగిపోయిన తమిళ ప్రజలు కొత్త నాయకుడొస్తే బాగుంటుందనుకుంటున్నారు. దీన్ని క్యాష్ చేసుకునే దిశగా బీజేపీ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను బుజ్జగించే పనుల్లో ఉంది. అయితే రజనీ కాంత్ మాత్రం రాజకీయాల్లో రానని తేల్చి చెప్పేస్తున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా రజనీని రాజకీయాలకు దూరంగా ఉండాల్సిందిగా చెప్పారు. దీంతో రజనీ మాత్రం రాజకీయాల్లోకి వచ్చేది లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీని ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి తేవడం కుదరదు. అందుకే 2019 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. అంతలోపు రజనీని బుజ్జగించి.. బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించేయాలని భావిస్తోంది. అన్నాడీఎంకేలో ప్రజాదరణ నేత లేకపోవడంతో పాటు.. డీఎంకేకు అవకాశాలున్నా.. మంచి క్రేజున్న నేత రజనీకాంత్‌ను బరిలోకి దించితే తప్పకుండా తమిళనాట తమదే విజయం అవుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
దీనిపై ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా స్పందిస్తూ.. అన్నాడీఎంకే పార్టీ విషయాల్లో తలదూర్చం.. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. పన్నీర్ సెల్వం తన పని తాను చేసుకుపోతున్నాడు.. అలాగే బీజేపీ కూడా తమ పార్టీ మేలుకు అనుగుణంగా కార్యచరణ చేస్తుందన్నారు. తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడే ఏదీ చెప్పనని.. జరిగేదేదో వేచి చూడాల్సిందేనని నవ్వుకుంటూ హింట్ ఇచ్చారు.