డబ్బు కోసం ఆ వధువు ఐదుగురికి కుచ్చు టోపీ పెట్టింది. మనస్సుకు నచ్చావని చెప్తూ.. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికింది. ఆ తర్వాత వారి దగ్గర డబ్బు గుంజేసి ఎస్కేప్ అయ్యేది. చివరికి విషయాన్ని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఊహించని విషయాలు వెలుగు చూశాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందిన వరుడు, భోపాల్ జిల్లాకు చెందిన ఓ వధువుతో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి ముహూర్తం రోజున కుటంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. అయితే, అప్పుడే అతనికి పెద్ద ట్విస్ట్ ఎదురైంది. వివాహ వేదికకు తాళం వేసి ఉంది. అది చూసి షాక్ అయిన వరుడు.. వధువుకు ఫోన్ చేశాడు. స్విచాఫ్ వచ్చింది. దీంతో అతను వధువు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. వారి ఫోన్లు కూడా స్విచాఫ్ వచ్చాయి. దీంతో అతనికి అనుమానం వచ్చింది. జరిగిన మోసాన్ని గ్రహించిన వరుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను ట్రేస్ చేసి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెల్లడించారు. పెళ్లి పేరుతో ఈ ముఠా వరుడి కుటుంబ నుంచి భారీగా డబ్బులు తీసుకుని, తీరా పెళ్లి సమయానికి పరారయ్యేవారు. ఇలా యువతి.. ఐదుగురు యువకులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.