దేశ రాజధాని ఢిల్లీలో ఓ విషాదకర ఘటన జరిగింది. వర్షంలో తడిసిన విద్యుత్ స్తంభాన్ని తాకిన ఓ మహిళా టీచర్ ప్రాణాలు కోల్పోయారు. కరెంట్ షాక్ కొట్టడంతో ఆమె మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన విహార్ ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన సాక్షి అహుజా (34) స్థానికంగా ఓ స్కూల్‌లో టీచరుగా పని చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా. భర్త అంకిత్ అహుజా గురుగ్రామ్‌లోని జపాన్ కంపెనీలో ఇంజనీరుగా పని చేస్తున్నారు.
ఆదివారం ఉదయం 5.30 గంటలకు సాక్షి చండీగఢ్ వెళ్లేందుకు ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్ మొదటి గేటు వద్దకు వచ్చారు. రోడ్డుపై నిలిచివున్న వర్షపు నీటిని దాటే క్రమంలో పట్టు కోల్పోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకున్నారు. ఆ స్తంభం నుంచి విద్యుత్ షాక్ కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అయితే, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. విద్యుత్ స్తంభం వద్ద ప్లాస్టిక్ గొడుగు లేని వైర్లు కనిపించాయని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది.