తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో ఇన్ఫోసిస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న ఓ యువతి దారుణంగా హత్య చేసిన వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ప్రధాన కూడళ్లన్నింటిలోనూ జల్లెడ పడుతున్నారు. కాగా ఈ ఘటన నగరంలో పెను సంచలనం సృష్టించింది. ప్రేమ వ్యవహారమే ఆ యువతి హత్యకు కారణమని పోలీసుల భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే స్వాతి (25) అనే ఓ యువతి కార్యాలయానికి వెళ్లేందుకుగాను రైల్వే స్టేషన్‌కు శుక్రవారం ఉదయం 7.30 ప్రాంతంలో చేరుకుంది. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆమెను గుర్తుతెలియని దుండగులు కత్తితో పీక కోసి పారిపోయారు.
చెంగల్పట్టులోని ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే స్వాతిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడిచేసి పారిపోయారని.. ఈ విషయం తెలుసుకుని సంఘటనా ప్రాంతానికి పోలీసులు వచ్చేలోపే తీవ్ర రక్తస్రావమైన స్వాతి ప్రాణాలు విడిచింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు.. స్వాతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై స్థానిక పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. హత్యకు గురైన స్వాతి బ్యాగు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని.. చివరిగా స్వాతి తన బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడినట్లు తెలిపారు. స్వాతితో చివరిగా మాట్లాడిన ప్రియుడి వద్ద విచారణ జరుపుతున్నారు. స్వాతి హత్య నేపథ్యంలో రైల్వే స్టేషన్లో భద్రతను పెంచారు. మహిళా రక్షణ కోసం రైల్వే స్టేషన్ల భద్రత కరువైందని మహిళా ప్రయాణికులు వాపోతున్నారు. ముఖ్యంగా నుంగంబాక్కం రైల్వే స్టేషన్ సీసీటీవీ కెమెరాలు కూడా లేకపోవడం ఈ హత్య చేసేందుకు దుండగులకు అనుకూలంగా మారింది.