అనుమానం పెనుభూతమైంది. ఇంట్లోనే కాదు చివరకు రైలు ప్రయాణంలో కూడా ఈ అనుమానం వదల్లేదు. దీంతో భార్యను వేగంగా వెళుతున్న రైల్లో నుంచి కిందికి తోసేశాడు. ఈ ప్రమాదంలో ఆమె రైలుకింద పడి దుర్మరణం పాలైంది. న్యూఢిల్లీ నుంచి చెన్నైకు వస్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ దారుణం జరిగింది. బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే...
ఈ రైలులో భార్యాభర్తలు ప్రయాణం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య బుధవారం ఉదయం నుంచి ఘర్షణ పడుతూ వచ్చారు. రైలు ప్రకాశం జిల్లా చిన్న గంజాం మండలం కడవకుదురు దగ్గరకు రాగానే భార్యను వేగంగా వెళుతున్న రైలులో నుంచి కిందికి తోసేశాడు. దీంతో ఆమె రైలు చక్రాల కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకి సమాచారం అందించారు.
తన భార్యపై అనుమానంతోనే ఆ వ్యక్తి ఆమెను రైల్లోంచి తోసేశాడని ప్రయాణికులు పోలీసులకు చెప్పారు. సదరు భార్యాభర్తల పేర్లు సంతోష్ కుమార్, కల్పనగా తెలుస్తోంది. కల్పన ఫోన్లో మాట్లాడుతుండగా ఆమెపై సంతోష్ అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. మృతురాలి భర్త సంతోష్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.