ఘర్షణలు వద్దు.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం.. మందిరంపై యోగి మాట

సోమవారం, 3 ఏప్రియల్ 2017 (16:08 IST)
వివాదాస్పద రామమందిర నిర్మాణంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘర్షణ వాతావరణం లేకుండా, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. 
 
ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక 'పాంచజన్య'కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సుప్రీంకోర్టు సూచనను స్వాగతించారు. 'సుప్రీంకోర్టు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వ సహకారం కావాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉన్నాం' అని ఆయన తెలిపారు.
 
కాగా, రామమందిరం వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని పక్షం రోజుల క్రితం సుప్రీంకోర్టు చేసిన విషయం తెల్సిందే. అయోధ్య అంశం సున్నితమైన, భావోద్వేగాలతో కూడుకున్నదని, కోర్టు వెలుపల సంబంధిత పార్టీలు కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని మార్చి 21న సుప్రీంకోర్టు సూచించింది. ఈ సూచనపై యోగి ఆదిత్యనాథ్ పై విధంగా స్పందించారు. 

వెబ్దునియా పై చదవండి