ఢిల్లీలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తా గట్టి హెచ్చరిక చేశారు. ఏకపక్షంగా ఫీజులు పెంచడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడితే పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. పాఠశాలలో ఇష్టారాజ్యంగా ఫీజులు పెంపును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మోడల్ టౌన్‌లోని క్వీన్ మేరీ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం కొందరు విద్యార్థులను బహిష్కరించినట్టు తెలుస్తోంది.
ఈ విషయాన్ని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి రేఖా గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె స్పందిస్తూ, పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడం, విద్యార్థుల తల్లిదండ్రులను వేధించడం వంటి చర్యలకు పాల్పడితే ఎంతమాత్రం సహించేది లేదన్నారు. ఫీజుల పెంపు విషయంలో పాఠశాలల యాజమాన్యాలు కొన్ని నియమనిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. అసాధారణంగా ఫీజులు పెంచరాదని, విద్యార్థులను అకారణంగా వేధించరాదని హితవు పలికారు.
నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తే సంబంధిత పాఠశాలలకు నోటీసులు పంపిస్తామని తెలిపారు. అవసరమైతే రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు. ప్రతి బిడ్డకు న్యాయం, గౌరవం, సరైన విద్య లభించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.