దేశవ్యాప్తంగా 63కి చేరిన స్వైన్ ఫ్లూ కేసులు

దేశంలో కొత్తగా మరో నాలుగు స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ వ్యాధి బారినపడిన వారి సంఖ్య 62కి చేరింది. దేశ రాజధానిలో తాజాగా మరో ఇద్దరికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. ఇదిలా ఉంటే దేశంలో స్వైన్ ఫ్లూ వ్యాధిని అదుపు చేసేందుకు బహుముఖ వ్యూహాన్ని పాటించామని, అది సత్ఫలితాలను ఇస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఢిల్లీలో కొత్తగా రెండు స్వైన్ ఫ్లూ కేసులు నమోదవగా, పూణే, ముంబయి నగరాల్లో మిగిలిన రెండు కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి దేశ రాజధానికి వచ్చిన 25 ఏళ్ల వ్యక్తికి ఒకరికి స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. అలాగే కెనడా నుంచి వచ్చిన 29 ఏళ్ల మహిళకు కూడా ఈ వ్యాధి సోకిందని ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు.

తాజాగా నమోదయిన రెండు కేసులతోసహా, దేశ రాజధానిలో నిర్ధారణకు వచ్చిన మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 26కి చేరింది. అమెరికా నుంచి పూణే వచ్చిన 24 ఏళ్ల యువకుడిలోనూ స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. అతనికి వ్యాధి సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆస్ట్రేలియా నుంచి ముంబయికి వచ్చిన 23 ఏళ్ల మహిళకు కూడా ఈ వ్యాధి సోకిందని అధికారులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి