యువతుల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోకాళ్లు కనిపించేలా చిరిగిన జీన్స్ ధరించడం సరికాదన్నారు. ఇలాంటి కత్తెర దుస్తులు సంస్కృతి విచ్ఛిన్నానికి కారణమవుతుందన్నారు. ఇలాంటి వస్త్రధారణ వల్ల వారు లైంగిక వేధింపులకు కూడా గురయ్యే అవకాశం ఉందన్నారు.
ఈ నేపథ్యంలో రావత్ వ్యాఖ్యలను ఆయన భార్య రష్మి త్యాగి సమర్థించారు. 'ఆయన చేసిన వ్యాఖ్యలో తప్పేమీ లేదు. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని సరిగా చూపించలేదు. మన సమాజాన్ని, దేశాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర అపూర్వమైనదన్నారు. మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, మన ఉనికిని, మన వస్త్రధారణను కాపాడాల్సిన బాధ్యత భారతీయ మహిళలపై ఉందని చెప్పారు' అని రష్మి అన్నారు. అనవసరంగా ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.