తొమ్మిదిరోజులు దేవిని పూజిస్తారు. అందువల్ల ఇది దేవీనవరాత్రులుగా వ్యవహారంలోకి వచ్చింది. అలాగే శరద్రుతువులో జరుపుకుంటారు గనుక శరన్నవ రాత్రులని కూడా అంటారు. ఈ పండుగలలో రామభక్తిభావం ఉత్తుంగతరంగంగా దేశాన్నంతటిని ముంచెత్తుతుంది. ఉత్తరభారతంలో పల్లెలు, పట్టణాలలో "రామలీల" ఉత్సవాలు నెలరోజులు ముందుగానే ప్రారంభం అవుతాయి.
అదీకాక జ్యోతిషశాస్త్ర ప్రకారం కూడా ఈ దశమిని విజయయాత్రకు అంటే సాఫల్యతకు ముహూర్తంగా నిర్ణయిస్తారు. కొన్ని ప్రాంతాలలో విజయదశమి "అపరాజితాదశమి" అనికూడా వ్యవహరిస్తారు. కారణం ఈ రోజున ప్రారంభించిన పనులు ఎప్పడూ విజయవంతం కావటమే. లౌకికమైన పూజలతో ఈ విజయదశమికి శాస్త్రీయవిధి కూడా వుంది. ఈ రోజున శమీవృక్ష పూజచేస్తాం.