శరన్నవరాత్రులు.. సమర్పించాల్సిన పుష్పాలు, నైవేద్యాలు

గురువారం, 27 సెప్టెంబరు 2018 (13:25 IST)
నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. మహాలయ అమావాస్యకు తర్వాత ప్రారంభమైన తొమ్మిది రోజుల పాటు నవరాత్రులను అనుసరిస్తారు. అక్టోబర్ 10 (బుధవారం) నుంచి అక్టోబర్ 18 (గురువారం) వరకు శరన్నవరాత్రులు.


ఈ తొమ్మి రోజులు మహేశ్వరి, కౌమారి, వరాహి, మహాలక్ష్మి, వైష్ణవి, ఇంద్రాణి, సరస్వతి, నరసింహీ, చాముండి అని పలు రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు. అయితే శక్తి ఏక స్వరూపమే. ఈ నవదుర్గా దేవీలను మన ఇంటికి స్వాగతించి, స్తుతించడమే నవరాత్రి పర్వదినాల విశేషం. 
 
తొలి మూడు రోజులు దుర్గాదేవిని, ఆ తర్వాతి మూడు రోజులు మహాలక్ష్మిని, చివరి మూడు రోజులు సరస్వతిని పూజించాలి. తొలిరోజున మహేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజున మహేశ్వరిని మల్లెలు, బిల్వ పత్రాలతో అలంకరించుకోవాలి. ఆ రోజు పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. రెండో రోజు కౌమారి రూపంలోని  దేవికి మల్లెలు, తులసీ ఆకులను సమర్పించాలి. పులిహోరను నైవేద్యంగా పెట్టాలి. 
 
మూడో రోజు వరాహి రూపంలో దర్శనమిచ్చే దేవికి ఎరుపు రంగు పువ్వులను సమర్పించి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. నాలుగో రోజు మహాలక్ష్మి రూపంలో కొలువయ్యే అమ్మవారికి మల్లెపువ్వులతో అలంకరణ చేసి.. అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఐదో రోజు వైష్ణవికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఆరో రోజు ఇంద్రాణి రూపంలో దర్శనమిచ్చే అమ్మవారికి జాజిపువ్వులతో పూజ చేయాలి. ఏడో రోజున సరస్వతీ దేవికి నిమ్మకాయతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. 
 
ఎనిమిదో రోజు నరసింహీ రూపంలోని అమ్మవారికి రోజా పువ్వులతో అలంకరించుకోవాలి. తొమ్మిదో రోజు చాముడేశ్వరిగా దర్శనమిచ్చే అమ్మవారికి తామర పువ్వులు, పాలతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి. అంతేగాకుండా ప్రతిరోజూ ఉడికించిన శెనగలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా ఇంటికొచ్చిన వారికి వాయనం ఇవ్వాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు