ఎలాంటి దాడులైనా ఉపేక్షించబోం : విక్టోరియన్ ప్రీమియర్

FILE
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ముగ్గురు భారతీయ యువకులపై జరిగిన దాడి అంశంపై.. విక్టోరియన్ ప్రీమియర్ జాన్ బ్రుమ్‌బై తీవ్రంగా స్పందించారు. తాజా దాడి జాత్యహంకారంతో కూడినదా, మరొకటా అన్న విషయాన్ని పక్కనపెట్టి.. అది ఎలాంటి హింస అయినా సరే సహించేది లేదని జాన్ బుధవారం స్పష్టం చేశారు.

ఆసీస్ ప్రతిష్టను మంటగలిపే ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసేవిగా ఉంటున్నాయని జాన్ వాపోయారు. ఇలాంటి సంఘటనలకు వెంటనే అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విదేశీ విద్యార్థుల రక్షణ విషయంలో కంగారు పడాల్సిందేమీ లేదనీ.. విదేశీ విద్యార్థులకు తమ దేశమే ఉత్తమమైనదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

కాగా.. మెల్‌బోర్న్‌లో భారతీయులపై తాజాగా జరిగిన దాడిపై అక్కడి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. తాజా ఘటనలో ముగ్గురు భారతీయ యువకులపై 70 మంది స్థానిక ఆస్ట్రేలియన్లు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిని ఖండించిన పోలీసులు, వాస్తవానికి నలుగురు వ్యక్తులు మాత్రమే దాడి చేశారనీ.. మరో ఇరవైమంది సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్నారని చెబుతున్నారు.

అయితే దాడికి పాల్పడినవారిని, ఆ సమయంలో అక్కడ ఉన్న ఆస్ట్రేలియన్లను విచారిస్తున్నట్లు సీనియర్ సార్జెంట్ గ్లెన్ పార్కర్ వెల్లడించారు. ఈ విచారణలో దాడికి దారితీసిన పరిస్థితులు, జరిగింది జాతి వివక్షాపూరిత దాడా? లేక బార్‌లో జరిగిన ఘర్షణ వల్లనే దాడికి దారితీసిందా..? తదితర కోణాలలో దర్యాప్తును సాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు.. ఆస్ట్రేలియాలో మరోసారి భారతీయులు జాత్యహంకార దాడులకు గురికావడంతో భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వెంటనే తాజా దాడికి సంబంధించి మెల్‌బోర్న్‌లోని భారత దౌత్యకార్యాలయాన్ని.. భారత విదేశాంగ శాఖ నివేదిక కోరింది. ఎప్పటికప్పుడు పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నామని ఆసీస్ చెబుతున్నప్పటికీ, ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంపట్ల ఆ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి