కాన్సులేట్‌లో ఇకపై తెలుగులోనే సంభాషణ

FILE
చదువుకునేందుకో, ఉద్యోగాల కోసమో విదేశాలకు వెళ్లే అభ్యర్థులు వీసా దరఖాస్తు చేసేటప్పుడు, వీసా ఇంటర్వ్యూలలోనూ ఇకమీదట తెలుగులోనే మాట్లాడవచ్చు. ఇప్పటిదాకా వీసా ఇంటర్వ్యూలు ఇంగ్లీషులోనే జరిగేవి. అయితే తెలుగువారికోసం అమెరికా కాన్సులేట్ హైదారాబాదులో ప్రత్యేకంగా ఈ ఏర్పాటును చేసింది.

అమెరికాలో ఉంటున్న కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు లేదా విద్యాభ్యాసం నిమిత్తం లేదా ఉద్యోగాల కోసమో... అక్కడికి వెళ్లే అభ్యర్థులకు స్థానిక భాషల్లోనే ఇంటర్వ్యూలను నిర్వహించాలని అమెరికన్ కాన్సులేట్ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన ఇంటర్వ్యూలలో మొత్తం 216 మంది వీసా దరఖాస్తుదారులను తెలుగులోనే ప్రశ్నించారు.

గతంలో కొంతమంది అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనల మేరకు అమెరికన్ కాన్సులేట్ పై సదుపాయాన్ని కల్పించింది. ఈ సందర్భంగా హైదరాబాదుకు చెందిన లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ... తన కుమారుడు అమెరికాలో చదువు పూర్తి చేశాడనీ, అక్కడి యూనివర్సిటీలో తను పట్టా తీసుకోవటం కళ్లారా చూడాలని తమ దంపతుల కోరికని, తమలాంటివారికి ఈ సదుపాయం చక్కగా ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి