ఎస్పీబీకి తానా లైఫ్‌టైం అవార్డు : జయరాం

అపర గాన గంధర్వుడు, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు... ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనున్నట్లు, ఆ సంస్థ అధ్యక్షుడు జయరాం కోమటి వెల్లడించారు. జూలై 2 నుంచి 4వ తేదీ వరకు చికాగోలో జరుగనున్న తానా మహాసభల సందర్భంగా ఈ అవార్డును బాలూకు అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అంతేగాకుండా తానా మహాసభల్లో.. ప్రఖ్యాత కవులు మేడసాని మోహన్, రాళ్లబండి కవితా ప్రసాద్, రచయితలు గొల్లపూడి మారుతీరావు, శ్రీరమణ, సూర్యదేవర, వాసిరెడ్డి నవీన్, గాయకుడు అందెశ్రీ తదితరులను కూడా పురస్కారాలతో సత్కరించనున్నట్లు జయరాం, మహాసభల కో ఆర్డినేటర్ ప్రసాద్ గారపాటి, సతీష్ వేమనలు మీడియా ప్రతినిధులకు తెలియజేశారు.

మహాసభల ఉత్సవాల్లో భాగంగా... 3వ తేదీ రాత్రి ఎస్పీ బాలు బృందం ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్‌ను నిర్వహించనున్నట్లు జయరాం పేర్కొన్నారు. సినీనటుడు మురళీమోహన్ ఆధ్వర్యంలో సుమంత్, అల్లరి నరేష్, రాజీవ్ కనకాల, భూమిక, స్వాతి, టీవీ యాంకర్లు సుమ, ఝాన్సీలు ప్రత్యేక ప్రదర్శనలను ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు.

అలాగే... తానా ఆధ్వర్యంలో మాటీవీ సౌజన్యంతో అమెరికాలో, ఆంధ్రప్రదేశ్‌లోనూ జరుగుతున్న సూపర్ సింగర్స్-3 సెమీ ఫైనల్స్ పోటీలు 4వ తేదీన జరుగుతాయని జయరాం వివరించారు. ఇక 3, 4 తేదీలలో బిజినెస్‌పై నిర్వహించే సదస్సులో రిజర్వు‌బ్యాంక్ మాజీ గవర్నర్ వైవి రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తారనీ... ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఎల్లా కృష్ణ, జె. వెకంట్, గల్లా జయదేవ్, టీహెచ్ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.

ఇదిలా ఉంటే... తానా మహాసభలకు పదివేల మందికి పైబడి ప్రేక్షకులు హాజరుకాగలరని భావిస్తున్నట్లు జయరాం తెలిపారు. ఈ వేడుకలకు ప్రభుత్వం తరపున ఓ బృందాన్ని పంపేందుకు ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా అంగీకరించారని ఆయన చెప్పారు. కేంద్రమంత్రి వాయలార్ రవితోపాటు రాష్ట్రం నుంచి ముగ్గురు లేదా నలుగురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు.

కాగా... ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న దాడులను ఖండించిన జయరాం.. దాడులు దురదృష్టకరమైనవి వ్యాఖ్యానించారు. ఇలాంటి దాడులను నివారించేందుకు, దాడులకు గురైన తెలుగువారికి తమ సహాయ సహకారాలను అందించేందుకు "థీమ్ స్క్వేర్" పేరుతో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి