కాలిఫోర్నియాలో "నాట్స్" విరాళాల విందు

ఇటీవల ఆంధ్రరాష్ట్రంలో పెద్ద ఎత్తున సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులకు సహాయం చేసేందుకు కాలిఫోర్నియాలోని ప్రవాసాంధ్రులు ఉదారంగా ముందుకొచ్చారు. స్థానిక ఇర్విన్ ఆలయ ప్రాంగణంలో వరద బాధితుల సహాయార్థం నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్), చక్ర కుషన్ సంస్థలు ఓ విరాళాల విందును ఏర్పాటు చేశారు.

ఈ విందులో సుమారు వంద కుటుంబాలకు చెందిన ప్రవాసాంధ్రులు పాల్గొన్నారనీ.. తద్వారా 4 వేల డాలర్లు వసూలయ్యాయని నాట్స్ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో చక్ర కుషన్ సంస్థ యజమాని రవి కోనేరు, ఎకనామిక్ డెవలప్‌మెంట్ కమీషనర్ ఆఫ్ చారిటీస్ పాట్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

విందులో భాగంగా పార్క్ వెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో పలువురు స్థానిక చిన్నారులు, పెద్దలు సంయుక్తంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. విందు కార్యక్రమానికి సహాయ సహకారాలను అందించిన రవి మాదాల, రవి కోనేరులకు కార్యక్రమ నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు. అంతేగాకుండా.. వరద బాధితులను ఆదుకునేందుకు ఉత్సాహంగా ముందుకువచ్చి విరాళాలు అందజేసిన ప్రవాసాంధ్రులకు కూడా ధన్యవాదాలను తెలియజేయటంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

వెబ్దునియా పై చదవండి