"బిగ్ బ్రదర్" నుంచి తప్పుకోనున్న శ్రీ దాసరి

భారతీయ విద్యార్థి శ్రీ దాసరి (25) బ్రిటీష్ రియాలిటీ షో "బిగ్ బ్రదర్" పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనతోపాటు ఒకే ఇంటిలో ఉంటున్న సహచరులు అబద్ధాలకోరుగా తనని ఆరోపించడంతో కలత చెందిన శ్రీ దాసరి ఈ పోటీ నుంచి బయటపడాలని నిర్ణయం తీసుకున్నట్లు "కాండాక్టెన్స్" వెల్లడించింది.

రష్యన్ బాక్సర్ ఏంజెల్ మద్యం సేవిస్తుండగా సభ్యుల మధ్య తలెత్తిన వివాదంతో శ్రీ దాసరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తానిక ఎక్కువ కాలం ఈ షోలో పాల్గొనలేనని డైరీ రూమ్‌లోనికి వచ్చి చెప్పిన శ్రీ దాసరి... "ఇక్కడున్న మనుషుల నిజ స్వరూపాల గురించి తెలుసుకున్నానని" వ్యాఖ్యానించటం గమనార్హం.

నిబంధనల ప్రకారం బిగ్ బ్రదర్ షో నుంచి వైదొలగాలంటే, 24 గంటల ముందు చెప్పాలని, తిరిగి ఇంటికెళ్లి సహచరులతో తలెత్తిన భేదాలను పరిష్కరించుకోవాలని చెప్పి నిర్వాహకులు శ్రీ దాసరిని లోపలికి పంపించినట్లు తెలుస్తోంది. కాగా, ఆల్కహాల్ సేవించలేదని శ్రీ దాసరి చేసిన ప్రకటన అబద్ధమని తేలడంతో పోటీదారులందరూ రెండు వర్గాలుగా చీలిపోయారు.

ఈ రెండు వర్గాల్లో ఒకటి శ్రీ దాసరికి అండగా నిలువగా, మరొకటి వ్యతిరేక వర్గంగా తయారై ఆయనపై విమర్శలు సంధిస్తోంది. తాను ప్రేమించిన నోయిరీ సైతం తనను అబద్ధాల కోరుగా అభివర్ణించడం ఆయనకు ఆగ్రహాన్ని కలిగించింది. తన సహచరుల నిజ రూపాలను చూశానని, ఇక ఎంత మాత్రం తాను ఈ పోటీలో కొనసాగే ప్రసక్తే లేదని శ్రీ ప్రకటించారు.

ఇదిలా ఉంటే... దక్షిణ భారతదేశానికి చెందిన శ్రీ దాసరి ప్రస్తుతం బ్రిటన్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్ వర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసిస్తున్నాడు. కాగా... 2007లో బిగ్ బ్రదర్ రియాలిటీ షోలో సెలబ్రిటీ బిగ్ బ్రదర్‌గా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఎంపికయిన సంగతి విదితమే...!

వెబ్దునియా పై చదవండి