ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తోన్న ఆర్థికమాంద్యం దెబ్బకు లక్షా యాభై వేల మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి "యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)"నుంచి స్వదేశాలకు తిరిగి వచ్చినట్లు... కేంద్ర ప్రవాస వ్యవహారాల శాఖా మంత్రి వాయలార్ రవి పేర్కొన్నారు.
ఈ విషయమై వాయలార్ రవి పార్లమెంటులో మాట్లాడుతూ... యాభై వేల నుంచి లక్షా యాభై వేలమంది కార్మికులు యూఏఈ నుంచి భారత్ తిరిగి వచ్చేశారని చెప్పారు. వీరంతా ఆర్థిక సంక్షోభం దెబ్బతో ప్రాజెక్టు పనులు కొనసాగక పోవడంతో ఉపాధి కోల్పోయి ఇంటిముఖం పడుతున్నారని ఆయన వివరించారు.
చాలామంది కార్మికులు సెలవుల మీద స్వదేశం వస్తున్నారనీ, అక్కడ పరిస్థితులు మెరుగుపడితేకానీ వీరు తిరిగి వెళ్లే అవకాశాలు కనిపించటం లేదని మంత్రి రవి చెప్పారు. సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లలో ఉద్యోగులను తొలగించటం కొనసాగుతోందని అక్కడి భారత రాయబార కార్యాలయాలకు కూడా సమాచారం అందిందని మంత్రి తెలిపారు.
అయితే ఆప్ఘనిస్థాన్, సిరియా, సూడాన్, బ్రూనై, లిబియా, జోర్డాన్, లెబనాన్ దేశాలలోని భారతీయులపై ఆర్థికమాంద్యం ప్రభావం చూపిన దాఖలాలేమీ కనిపించటం లేదని మంతి అన్నారు. అమెరికాలోని అన్ని వర్గాలపై మాంద్య దెబ్బ పడిందని, అక్కడి భారతీయులు వృత్తి నిపుణులు కావడంతో ఉద్యోగాలు కోల్పోతున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పారు.
ఇదిలా ఉంటే... అమెరికా, యూఏఈలలోని భారతీయ కార్మికులకు సేవలను అందించేందుకు అక్కడి మన రాయబార కార్యాలయాలను ముందుగానే సంసిద్ధం చేసినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా వాయలార్ రవి తెలియజేశారు.