తానా వేళ... చంద్రబాబు సన్నిహితుడిపై వేటు... సీఎం జగన్ కీలక నిర్ణయం

గురువారం, 4 జులై 2019 (19:06 IST)
అమెరికాలో తానా సంబరాలు ఆరంభం అవుతున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో ఎన్నారై వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే వ్యక్తి మీద వేటు వేసారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు లేదా ఆయన కుమారుడు అమెరికాలో కాలు పెడితే ఆయనకు స్వాగతం దగ్గర నుండి అన్ని కార్యాక్రమాలు మొత్తం పర్యవేక్షించేవారు. 
 
ఇక.. అమెరికాలో తెలుగు వారు తానా మహాసభల పేరుతో ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ.. జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం అధికార వర్గాల్లోనే కాదు.. రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.
 
అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హోదాలో ఉన్న కోమటి జయరాం పైన జగన్ ప్రభుత్వం వేటు వేసింది. టీడీపీకి అత్యంత సన్నిహితుడు అయిన జయరాం టీడీపీ హయాంలో అమెరికా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు ..లోకేశ్‌తో పాటుగా టీడీపీ నేతలు ఎవరు అమెరికా వచ్చినా ఆయన వారికి ఆతిధ్యం అందించటం మొదలు అక్కడ అన్ని కార్యక్రమాలు పర్యవేక్షించేవారు. తెలుగువారికి సంబంధించిన సభలు ఏమైనా జరిగినా వీటన్నింటినీ జయరామే దగ్గరుండి చూసుకునే వారు. ఆయనకు చంద్రబాబు ఏరికోరి తన హాయంలో అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హోదా కల్పించారు. 
 
ఆయనతో పాటుగా వేమూరి రవి ప్రసాద్ సైతం ఎన్నారైల వ్యవహారాలను చంద్రబాబుక అనుకూలంగా చక్కబెట్టేవారు. ఆయనకు ఏపీ ఎన్నార్టీ ఛైర్మన్ పదవిని నాడు చంద్రబాబు అప్పగించారు. ఇక, ఇప్పుడు జగన్ అధికారంలోకి రావటంతో కోమటి జయరాంను ఆ పదవి నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు