TeNF ఆధ్వర్యంలో ఇంగ్లాండులో మహిళా దినోత్సవం... అంబరాన్నంటిన సంబురాలు

సోమవారం, 6 మార్చి 2017 (19:13 IST)
ప్రవాస తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో మార్చి 4న ప్రవాస మహిళలు అంతా ఒకేచోట చేరి మహిళా దినోత్సవ వేడుకలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకలకు ఇండియన్ జిమ్ఖానా క్లబ్ వేదికగా మారింది. ఇంగ్లాండ్ లోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 300 మంది మహిళలు ఈ వేడుకలో పాల్గొన్నారు. 
 
ప్రవాస తెలంగాణ సంఘం-మహిళా విభాగం సభ్యులు వేడుకలకు విచ్చేసిన మహిళలను సాదరంగా ఆహ్వానించారు. మీనాక్షి అంతటి స్వాగతోపన్యాసంలో మహిళా సాధికారత కోసం మహిళలందరూ కలసికట్టుగా కృషి చేయాలని, ఈ వేదిక ద్వారా ప్రవాస మహిళలను ఒకేతాటి మీదకు తీసుకువస్తున్నామనీ, వ్యాపార, టెక్నాలజీ, విద్య, సేవ తదితర రంగాలలో ఆసక్తిగా వున్న వారంతా ఈ గ్రూపు ద్వారా TeNFను సంప్రదించవచ్చననీ, TeNF ఎల్లప్పుడూ సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు.
 
ఇటీవల ప్రవాస తెలంగాణ సంఘం-మహిళా విభాగం 'చేనేత వస్త్రాలను ధరించుదాం- నేతన్నకు మద్దతునిద్దాం' అని నినదిస్తూ చేసిన ప్రచార కార్యక్రమానికి వచ్చిన అశేష స్పందన ఎంతో స్ఫూర్తినిచ్చిందనీ, అదే స్ఫూర్తితో చేనేత వస్త్రాల ప్రదర్శనను ఈ వేడుకలలో ప్రధాన భాగం చేశామని, దీని ద్వారా లండన్ నగరంలో నివస్తున్న మహిళలకు చేనేతను మరింత చేరువ చేసే అవకాశం దక్కిందని, ప్రవాస మహిళలందరినీ చేనేతను ధరించే విధంగా ఈ వేదిక ద్వారా ప్రోత్సహిస్తున్నామని, ఇకపై ఎవరైనా చేనేత చీరలు కావాలంటే TeNFకు సందేశం పంపవచ్చనీ, తామే చీరలను నేతన్నల దగ్గర నుంచి తెప్పిస్తామని ప్రీతి నోముల తెలిపారు.
 
హేమలత గంగసాని, శౌరి గౌడ్, శ్రీలక్ష్మి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఆటవిడుపు కోసం రాఫెల్ డ్రా మరియు రకరకాలైన చిన్నచిన్న ఆటల పోటీలు నిర్వహించి గెలిచినవారికి బహుమతులు అందించారు.
 
వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటో బూత్‌లో ఆసక్తి కల మహిళలు ఫోటోలు తీసుకుని ఆనందించారు. అంతేకాకుండా ఉత్సాహభరితమైన పాటలతో మొదలైన డీజె అందరినీ అలరించింది. అందరూ ఎంతో ఉత్సాహంగా నర్తించారు. హైదరాబాది బిరియాని, ఇంకా సుప్రసిద్ధ తెలంగాణ వంటకాలతో కూడిన విందుకి అంతా సంతృప్తి చెందారు.
 
 
మహిళల స్పందన:
 
ప్రతిరోజూ దైనందిన కార్యక్రమాలతో సతమతమయ్యే ఈ వేడుకలు ఎంతగానో నచ్చాయనీ, ఇక్కడికి వచ్చినందుకు ఎంతోమంది పరిచయమయ్యారనీ, తమలో చాలామందికి ఎన్నో చేయాలని ఉంటుందనీ, తమలాంటివారికి TeNF కల్పిస్తున్న ఈ వేదికను సద్వినియోగం చేసుకుంటామని, ఆటపాటలతో సేదదీరామని, మరీ ముఖ్యంగా చేనేత వస్త్ర ప్రదర్శన చాలా గొప్ప కార్యక్రమము అని వారే కాకుండా వారి స్నేహితులకి కూడా ధరించమని చెప్తామనీ, విందు ఎంతో సంతృప్తినిచ్చిందనీ హాజరైన మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
 
దూర ప్రాంతాల నుంచి కూడా ఈ వేడుకలకు విచ్చేసి విజయవంతం చేసినందుకు అందరికీ ప్రవాస తెలంగాణ సంఘం-మహిళా విభాగం తరపున పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. వేడుకలకు హాజరైన మహిళలు స్పందించిన తీరు తమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందనీ, ఇకముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకుందామని, వివిధ రంగాలలో ఆసక్తి వున్నవారు TeNFను ఎప్పుడైనా సంప్రదించవచ్చుననీ, TeNF నిర్వహించే వేడుకలలో పాలుపంచుకోవచ్చుననీ, వ్యాపారపరమైన స్టాల్స్‌ని ఏర్పాటు చేసుకోవచ్చుననీ, సేవా కార్యక్రమాలలో వాలంటీర్లుగా పాల్గొనవచ్చుననీ జ్యోతి కాసర్ల చెప్పారు.
 
ఈ వేడుకలలో మహిళా విభాగం తరపున జయశ్రీ గంప, మీనాక్షి అంతటి, హేమలత గంగసాని, జ్యోతి కాసర్ల, గౌరీ, శౌరి, శ్రీలక్ష్మి నాగుబండి, వాణి అనసూరి, రమ, శ్రీవాణి, కావ్య, ప్రియాంక, సంధ్య, మేఘల, సుచరిత, శిరీషలు చేనేత చీరలను కొని నేతన్నలకు తమ మద్దతుని తెలిపిన మహిళలందరికీ ధన్యవాదములు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి