అమెరికాలోని షిరిడీ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న న్యూజెర్సీలోని సాయిదత్త పీఠం తన లక్ష్య సాధనంలో కీలకమైన ఓ ఘట్టాన్ని పూర్తి చేసింది. షిరిడీ నిర్మాణ స్థలం కొనుగోలు కోసం విరాళాలు సేకరించేందుకు సాయిదత్త పీఠం స్థల సేవ పేరుతో అమెరికాలోని న్యూజెర్సీ నుంచి ప్రారంభమైన సాయి పాదుక యాత్ర 43 రాష్ట్రాలలోని వివిధ నగరాల్లో కొనసాగి చివరకు మళ్లీ న్యూజెర్సీ చేరింది.
అనంతరం పల్లకీ దాత కనికిచెర్ల లీలాకృష్ణ నివాసంలో ఆఖరి పాదుకా పూజ నిర్వహించి ఆ తర్వాత అక్కడి నుండి ప్రారంభమైన యాత్రకు సాయినామ జపంతో భక్తజనం జేజేలు పలికారు. స్థానిక పోలీసు యంత్రాంగం కూడా దీనికి తమవంతు సహకారం అందించింది. సాయిదత్త పీఠం సభ్యులు, సాయిభక్తులు వందలాది మంది ఈ యాత్రలో పాలుపంచుకున్నారు.
పాదుక యాత్ర ప్రత్యేకత:
అమెరికాలో షిరిడీ నిర్మాణమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న సాయిదత్త పీఠం స్థల సేవకు విరాళాల నిమిత్తం ఈ పాదుకాయాత్ర చేపట్టింది. ఆ షిరిడీనాథుడి పాదాలనే భక్తుల చెంతకు తీసుకెళ్లి అమెరికాలో షిరిడీ లక్ష్యాన్ని వివరించింది. సాయిదత్త పీఠం ప్రధాన నిర్వాహకులు ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి నేతృత్వంలో రెండు సంవత్సరాల పాటు అమెరికాలో 43 రాష్ట్రాల్లో 75,000 మైళ్ల దూరం ఈ సాయి పాదుకా యాత్ర సాగింది.
సాయిదత్త పీఠం సిద్ధం చేసిన సాయిరథం ద్వారా ఈ పాదుకా యాత్ర 43 రాష్ట్రాల్లో దాదాపు 2వేల ఇళ్లకు చేరుకుని సాయిపాదుకలు పునీతం చేశాయి. 150కి పైగా దేవాలయాలను చుట్టివచ్చింది. వందమందికి పైగా సమన్వయకర్తలు, 500 మందికి పైగా స్వచ్చంద సాయి సేవకులు ఈ యాత్రలో తమ విలువైన సేవలు అందిస్తే 1,11,111 మందికి పైగా సాయిభక్తులను దీవించాయి. ప్రతి రాష్ట్రంలో సాయిదత్త పీఠం చేపట్టిన ఈ పాదుకా యాత్రకు భక్తులు నీరాజనం పట్టారు. ఇంటింటికి పిలిచి సాయి పాదుక పూజను చేయంచుకుని తరించారు. చూడండి వీడియోను...