అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన తెలుగు నటీమణుల వ్యభిచార దందా ఇపుడు టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా, ఈ దందా నిర్వాహకుల నుంచి చికాగో పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీలో పలువురు హీరోయిన్ల పేర్లు, వారికి ముట్టజెప్పిన నగదు, ఇచ్చిన బహుమతులు, వచ్చిన విటుల వివరాలు ఉన్నాయి. ఈ డైరీని పోలీసులు అమెరికా కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ డైరీలో ఎవరెవరి పేర్లు ఉన్నాయోనన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అదేసమయంలో గత కొన్నేళ్లుగా సినిమా షూటింగ్‌ల పేరిట వర్ధమాన నటీమణులతో పాటు.. పలువురు హీరోయిన్లను పర్యాటక వీసాలపై అమెరికాకు తీసుకెళ్లి ఈ వ్యభిచార దందా నిర్వహిస్తూ వచ్చిన నిర్వాహకులు, తెలుగు చిత్ర నిర్మాత మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రలను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఈ దందాపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అమెరికా పోలీసులు.. 42 పేజీల చార్జిషీట్ తయారు చేసి చికాగో కోర్టులో సమర్పించారు.
ఇదిలావుంటే నిర్వాహుకుడు కిషన్ పిలుపు మేరకు డిసెంబర్ 2017లో అమెరికాకు వెళ్లి వచ్చిన ఓ నటి, ఆపై కిషన్‌ను వేడుకుంటూ ఓ ఈమెయిల్ రాసింది. దీన్ని పోలీసులు గుర్తించారు. ఈ మెయిల్ చూసిన పోలీసులు, ఆమెను ప్రధాని బాధితురాలు ఏగా చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆమె తన ఈ-మెయిల్ లేఖలో దయచేసి తనకు ఇక ఫోన్ చేయవద్దని, కాంటాక్ట్ కూడా చేయడానికి ప్రయత్నించవద్దని, మీతో కలసి 'వ్యాపారం' చేయడం తనకు ఇబ్బందిగా ఉందని వాపోయింది. మళ్లీ కాంటాక్ట్ చేస్తే తాను ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించింది.
ఇక దీనికి బదులిచ్చిన కిషన్, పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆమెను, ఆమె కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ బెదిరింపు లేఖ తమ విచారణలో కీలకమైందని, దీనితో పాటు పలువురు తారలకు రాసిన ఈ-మెయిల్స్, కిషన్ భార్య చంద్ర సెల్‌ఫోన్‌లోని టెక్ట్స్ మెసేజ్‌లు తమకు లభించాయని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. చంద్ర ఓ పుస్తకంలో ఎవరు ఎప్పుడు వచ్చి ఎక్కడున్నారు? వారి దగ్గరకు ఎవరెవరు వచ్చారు? ఎంత ఇచ్చారు? తదితర వివరాలన్నీ రాసుకోగా, దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలో ఇపుడు తెలుగు చిత్రపరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది.