మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2009గా నిఖితాషా

అమెరికాలో స్థిరపడిన భారతీయ విద్యార్థి నిఖితాషా మార్వాహా మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2009 కిరీటాన్ని దక్కించుకుంది. గత సంవత్సరం ఈ పోటీలో విజయం సాధించిన ముంబయికి చెందిన షగున్ సారాభాయి నుండి ఈ అవార్డును నిఖితాషా అందుకున్నారు.

మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ ఫైనల్ పోటీలలో న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నకు... అమెరికా నూతన అధ్యక్షుడు బరాక్ ఒబామా తనకు స్ఫూర్తి అని సమాధానం చెప్పిన నిఖితాషా ఈ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. ప్రపంచంలో అత్యుత్తమంగా భావించే ఏ స్థానానికైనా చేరుకోవాలనుకునే తపన ఉన్న ప్రతి భారతీయుడికి అమెరికా ఎన్నికలే స్ఫూర్తిదాయకం అని నికితాషా అభిప్రాయం.

మార్పు నినాదంతో ప్రపంచ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన ఒబామా... రానున్న నాలుగేళ్లలో తన సత్తా చూపుతారనీ నిఖితాషా మరో ప్రశ్నకు సమాధానం చెప్పారు. గెలవాలన్న బలమైన కోరిక ఉండి, పట్టుదలతో ప్రయత్నిస్తే.. సాధించలేనిది ఏమీ లేదని ఆమె పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే... కమ్యూనికేషన్స్ విద్యార్థి అయిన నిఖితాషా మిస్ ఇండియా వరల్డ్ వైడ్‌ కిరీటాన్ని అందుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... మాధురీదీక్షిత్ అంటే ప్రాణమనీ చెప్పింది. కాగా, ప్రేమికుల రోజున జరిగిన ఈ పోటీలలో ఆస్ట్రేలియాకు చెందిన కంచన్ వర్మ, నెదర్లాండ్స్‌కు చెందిన సునైనా భోయెండీ తరువాతి స్థానాలలో నిలిచారు.

వెబ్దునియా పై చదవండి