మదర్‌ థెరిస్సా సేవలను కొనియాడిన హిల్లరీ..!

FILE
వాషింగ్టన్‌లో జరిగిన జాతీయ ప్రార్ధనా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖా మంత్రి హిల్లరీ క్లింటన్.. మదర్ థెరిస్సా సేవలను తనదైన శైలిలో కొనియాడారు. దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా పాల్గొన్న ఈ సమావేశంలో హిల్లరీ మదర్‌తో తనకు గల అనుభవాలను, వాషింగ్టన్‌లోని శరణాలయంలో ఆమెతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను కవితాత్మకంగా వర్ణించి చెప్పారు.

1994వ సంవత్సరం, ఫిబ్రవరిలో ఇదే చోట జరిగిన సమావేశంలో వక్తగా ఈ స్థానంలో మదర్ ఉన్నారనీ, శిశుమరణాలకు, అబార్షన్లకు వ్యతిరేకంగా జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆమె బాగానే గుర్తుండే ఉంటుందని హిల్లరీ వ్యాఖ్యానించారు.

ఈ సమావేశం తరువాత బ్రేక్‌ఫాస్ట్ చేశాక తనతో మాట్లాడాలని మదర్ అడిగారని, వెంటనే తాను అందుకు అంగీకరించానని హిల్లరీ చెప్పుకొచ్చారు. ఇద్దరం కర్టెన్ల వెనుకన మడత కుర్చీలను వేసుకుని కూర్చున్నామనీ, ఆ సందర్భంగా మదర్ చెప్పిన విషయాలను విన్న తనకు ఆమె ఎంత ఉన్నతమైన వ్యక్తో అర్థమైందని ఆమె పేర్కొంది. తమ ఇద్దరి కలయిక సందర్భంగా ఎంతో నిరాడంబరమైన మదర్ కేవలం చెప్పులను మాత్రమే ధరించి వచ్చిందని ఆమె గుర్తు చేసుకుంది.

మదర్ ప్రోత్సాహంతో అనాథ సేవల్లో పాలుపంచుకునేందుకు సిద్ధపడ్డాననీ, మదర్ ఎక్కడ ఉన్నా ఆమె వద్ద నుంచి తనకు పిలుపు వచ్చేదని హిల్లరీ పేర్కొన్నారు. ఇండియా నుంచైనా, వియత్నాంనుంచైనా, ప్రపంచంలోని ఏ మూలనుంచైనా మదర్ పిలిచారంటే రెక్కలుగట్టుకుని వాలిపోయేదాన్నని అన్నారు. మదర్‌తో కలిసి పనిచేసినంతకాలం ఆమె ఓ అమృతమయి అనీ, తన సంకల్పంముందు ఎలాంటి అంశాలైనా చిన్నవేనని తనకు అర్థమైందంటూ.. హిల్లరీ చాలా సుదీర్ఘమైన తన ప్రసంగంలో వివరించింది.

వెబ్దునియా పై చదవండి