మలేషియన్ పంజాబీ పార్టీకి తొలిసారిగా మహిళా అధ్యక్షురాలు

FILE
మలేషియన్ పంజాబీ పార్టీకి తొలిసారిగా ఓ ప్రవాస భారతీయ సిక్కు మహిళ సుషీల్ కౌర్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. గత 24 సంవత్సరాల కాలం నుంచి మలేషియాలోని సిక్కు ప్రజానీకానికి సేవలు అందిస్తున్న ఈ పార్టీకి ఒక మహిళలను అధ్యక్షురాలిగా ఎంపిక చేయటం ఇదే మొదటిసారి కావటం విశేషంగా చెప్పవచ్చు.

తన తండ్రి జస్వంత్ సింగ్ 1986లో ప్రారంభించిన మలేషియన్ పంజాబీ పార్టీకి, 59 సంవత్సరాల సుషీల్ కౌర్ తొలిసారిగా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. కాగా.. పార్టీ సాధారణ సమావేశాలలో 50 మంది ప్రతినిధులు కౌర్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక చేయటంతో పార్టీ అధ్యక్ష పదవి ఆమెను వరించింది.

మలేషియా ప్రజానీకంలో మొత్తంమీదా ఎనిమిది శాతంగా ఉన్న ప్రవాస భారతీయులలో ఎక్కువమంది హిందువులు ఉన్నారు. వీరిలో చాలా సంవత్సరాల క్రితం వ్యాపారం నిమిత్తం మలేషియా వచ్చి స్థిరపడ్డ లక్షమంది సిక్కు ప్రజానీకం కూడా ఉంది. ఇదిలా ఉంటే.. సోషియల్ ఇంపాక్ట్ స్టడీ‌స్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా గుర్తింపు సాధించిన సుషీల్ కౌర్, ఒక రాజకీయ వేత్తగానే కాకుండా.. తన తండ్రి స్థాపించిన పార్టీకి ఓ బాధ్యతాయుతమైన స్థానానికి ఎంపికవటంపట్ల పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి