పల్లెటూరి బడిలో 8వ తరగతి చదువుతున్న రోజులు -1974-... పల్లెటూళ్లో చిన్న చదువులు, ఊరి బయట మరో పెద్ద ఊరిలో హైస్కూలు చదువుతూ 7వ తరగతి నుంచి అప్పుడే పెద్దక్లాసుకు ఎగబాకివచ్చిన రోజులు.. మా క్లాసుకు రెండు సెక్షన్‌లు. 8 ఎ, 8 బి. మా బి సెక్షన్‌కి తెలుగు టీచర్‌గా సహదేవరెడ్డి సార్ వచ్చేవారు. పురాణాలు, ప్రబంధాలు, చక్కటి పద్యపఠనాలతో క్లాసును ఉర్రూత లూగించేవారు.. ఆయనకు తెలుగు పద్యాలు అన్నా ఘంటసాల పాటలు అన్నా వల్లమాలిన ప్రీతి.
తెలుగు పద్యం తప్ప మరో సాహితీ ప్రక్రియను కలలో కూడా ఆమోదించనంత ఉడుంపట్టు ఆయనది. క్లాసులో ఆయన మనుచరిత్ర లోనుంచో ఆముక్తమాల్యద లోనుంచో భాగవతం నుంచో పద్యాలు కంచుకంఠంతో భావ గాంభీర్యంతో పాడుతుంటే మాకు ఇక ప్రపంచంలో ఏం జరుగుతున్నదీ కూడా వినబడేది కాదు.
ఇంగ్లీష్, సైన్స్, లెక్కలు సబ్జెక్ట్‌లతో పరమ విసుగ్గా ఉండే మాకు ఆయన క్లాస్ అంటే చాలు చెవులు నిక్కబొడుచుకుని ఆయన రాక కోసం ఎదురు చూసేవాళ్లం. మామూలుగానే తెలుగు క్లాసు అంటే పిల్లల తూగును, నిద్రమత్తును వదిలించేదని అప్పట్లో గుర్తింపు పొందింది. అందుకే లెక్కలు, సైన్స్ మధ్యలో లేదా సైన్స్, ఇంగ్లీష్ మధ్యలో తెలుగు క్లాసును ఇరికించేవారు. ఇది తెలుగు టీచర్లను కాస్త మండించేదనుకోండి.
మా మాస్టారూ మా ఘంటసాలా..
ఈ రోజు ఆయన ఉన్నారో లేరో.. మూర్తీభవించిన గానగంధర్వుడిలా ఆయన.. ఇప్పటికీ గొంతెత్తి పాడుతున్నట్లు, జీవితంలో మేం కోల్పోతూ వస్తున్న ఎన్నెన్నో జ్ఞాపకాలను తట్టి లేపుతున్నట్లు... పద్యం అనే తెలుగు జాతి సంపద సాక్షిగా మమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తున్నట్లు...
మా సహదేవరెడ్డి సార్ తెలుగు ప్రాచీన సాహిత్యం పట్ల మాలో ఎంత గాఢానురక్తిని క్లాసులో పెంచి పోషించేవారంటే ఏ ఒక్కరం కూడా తెలుగు క్లాస్‌ను తప్పించుకునే వాళ్లం కాదు. స్వతహాగా గత జీవితంలో హరికథాగానం చేసి బతికిన ఆయన రాగయుక్తంగా ప్రబంధపద్యాలు పాడి వినిపిస్తుంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్లం.
పద్యాన్ని మొదటిసారి రాగయుక్తంగా, రెండోసారి మామూలుగా చదివి వినిపించే ఆయన నేర్పుకు మేం దాసోహమయ్యేవాళ్లం. పద్యాన్ని రాగయుక్తంగా పాడకుండా చదివి వినిపించాలన్న నిబంధన ఇంటర్, డిగ్రీ, పిజి తరగతులలో అప్పటికే అమలవుతున్నందువల్ల మేం పై చదువులకు వెళ్లే కొద్దీ తెలుగు పద్య గాన మహిమా శ్రవణానుభవం మాకు కొరవడిందనుకోండి.
పద్యాన్ని భావయుక్తంగా రాగయుక్తంగా మాస్టారు పాడి వినిపిస్తుంటే ఈ జన్మకిది చాలు అనిపించేది. చివరకు ఇది ఎంత ప్రభావం వేసిందంటే తెలుగు పద్యం పాడితే మా మాస్టారు అయినా పాడాలి లేదా ఘంటసాల గారే పాడాలి అనిపించేంతగా చెవులు రిక్కించి వినేవాళ్లం. మళ్ళీ ఈ జన్మకు ఆ పాట, పద్యం వినే అవకాశం ఉండదేమో అన్నంతగా...
..... అంటూ సంస్కృత సమాస పద భూయిష్టమైన మనుచరిత్రలోని ప్రవరుడి ఘట్టాలను పాడి వినిపిస్తుంటే, మాకు ఒక్క పదం అర్థం కాకపోయినా ఒళ్లు పులకరించిపోయేది. రేడియోలో ఘంటసాల, సుశీల, లీల, జిక్కి, జానకి, భానుమతి పాటల, పద్యాల పారవశ్యం ఒక వైపు, ఇల్లు వదిలాక స్కూల్లో తెలుగు పద్య శ్రవణానందం మరోవైపు... మా బాల్యం ఎంత హాయిగా గడిచిపోయిందో...వ్యావసాయిక జీవన సంస్కృతిలో పెరిగిన మా కష్టాలను తాత్కాలికంగా మర్చిపోయేలా చేసిన ఈ పాటలు, పద్యాలు ఒక రకంగా చెప్పాలంటే పారే యేటినీటిలో స్నానంలాగా, మండువేసవిలో జలజలా కురిసి మురిపించే వానలాగా మా తరాన్ని సేదతీర్చేవి,
తెలుగు పాట... తెలుగు పద్యం... ఈ రెండింటికి నోచుకున్న పచ్చకాలం మాది. ఇవి లేని పల్లె జీవితాన్ని ఊహించుకోలేం. ఇప్పటికీ ఘంటసాల పద్యాలు రేడియోలోనో, టీవీలోనో, సినిమాల్లోనో, లేక ఇంట్లో మా సిస్టమ్‌లోనో వింటూ ఉంటే ప్రపంచాన్ని అలాగే మర్చిపోవాలన్నంత మైమరపు... తదనంతర జీవితంలో ఎన్ని డక్కీమొక్కీలు తిన్నా, సొంతఊరు వదిలి చదువు కోసం, ఆశయం కోసం, జీవిక కోసం ఎన్నెన్ని ప్రాంతాలు తిరిగినా ఆ తెలుగు పద్య గాన శ్రవణా సౌరభం నానుంచి దూరం కాలేదు.
"కనియెన్ రుక్మిణి, చంద్రమండల ముఖున్, కంఠీరవేంద్రావలగ్ను..." అంటూ శ్రీకృష్ణపాండవీయం సినిమాలో తొలిసారి శ్రీకృష్ణుడిని రుక్మిణి సందర్శించిన తీరును ఘంటసాల పాడగా వింటూంటే... ప్రాణం అలాగే వదిలేసినా చాలు అనిపించేంత ఆత్మానందం (?) సంగీతం, మృదంగ ధ్వని, లయ, గానం కలగలసిన ఆ మహిమాన్విత రసాభూతిని ఈ నాటికీ మర్చిపోలేను. ఇలాంటి ఎన్ని పద్యాలు ఎన్ని పర్యాయాలు భట్టీ కొట్టి మరీ మా బాల్యంలో మేం నడుస్తున్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు, కొండలు గుట్టలు ఎక్కుతున్నప్పుడు మేం పాడుకునేవారిమో... దీనికంతటికీ మా తెలుగు టీచర్ పెట్టిన పద్య బిక్షే మూలం.
తెలుగు పద్యాన్ని తలుచుకున్నప్పుడల్లా ఘంటసాల గారి గానం ఒకవైపు, మా తెలుగు టీచర్ సహదేవరెడ్డి గారి గంభీర శ్రవణం ఒకవైపు ఈ నాటికీ నేను కలలో కూడా మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు. తెలుగు పద్యగానామృతాన్ని మాకు పంచిపెట్టడంతో పాటు ఎన్ని వెలలేని జీవిత సత్యాలను ఆయన ఆ మూడేళ్ల మా స్కూలు జీవితంలో మాకు నూరిపోశారో....
ఈ రోజు ఆయన ఉన్నారో లేరో.. కానీ, కడప జిల్లా సుండుపల్లి మండలంలోని మా గుట్టకిందరాచపల్లె (జి.కె.రాచపల్లి) హైస్కూలు, 8, 9, 10 తరగతుల్లో మేం కూర్చున్న ఆ తెలుగు తరగతి గదులు, ఆ గదుల్లో కుర్చీలో మూర్తీభవించిన గానగంధర్వుడిలా మా తెలుగు టీచర్... ఇంకా ఇప్పటికీ గొంతెత్తి పాడుతున్నట్లు, జీవితంలో మేం కోల్పోతూ వస్తున్న ఎన్నెన్నో మధురానుభవాలను తట్టి లేపుతున్నట్లు.... పద్యం అనే తెలుగు జాతి సంపద సాక్షిగా మమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తున్నట్లు...
మర్చిపోలేను... తెలుగు పద్యం అంటే రాజులు, రాణుల అంగాగ వర్ణనలకు ప్రాధాన్యమిచ్చిన ఫ్యూడల్ సాహిత్య ప్రతీక అంటూ... గడచిన శతాబ్ద కాలంగా తెలుగు సాహితీలోకంలో ఎన్ని వాదోపవాదాలు పదే పదే కొనసాగుతూ వస్తున్నప్పటికీ... మర్చిపోలేను... పద్యరూపంలోని ఆ లయాన్విత సంగీత ఝరిని... ఆ విశ్వవీణానాదాన్ని.... పద్యగానంతో, శ్రవణంతో మా బాల్యజీవితాన్ని వెలిగించిన, మా సహదేవరెడ్డి మాస్టారు చిరస్మృతులను మర్చిపోలేను.
అలాగే.. తెలుగు పద్యం, తెలుగు పాట మహత్తును మా చిన్ననాటి కలల ప్రపంచంలో చిక్కగా రుచి చూపిన మా ఊరును, మా వ్యావసాయిక జీవన సంస్కృతిని, జీవితంలో ఏవి తోడున్నా లేకపోయినా నేనున్నానని పలకరిస్తూ తెలుగు పాటను మోసుకొచ్చే మా ఆలిండియా రేడియోను, అన్నిటికంటే మించి మా ఘంటసాలను మా సుశీలను, మా లీలను, మా జిక్కిని, మా జానకిని, మా భానుమతిని ఎవ్వరినీ మర్చిపోలేను...