శకుని అంటే ధూళిపాళే... ఎన్టీఆర్ మెచ్చుకున్న శకుని మామ పుట్టినరోజు 24
గురువారం, 24 సెప్టెంబరు 2015 (13:03 IST)
ధూళిపాళ, ఈ పేరు వినగానే మనకి గుర్తుకు వచ్చేది శకుని పాత్ర. ఈ పాత్రతో సహా ఎన్నో విభిన్న పాత్రలు పోషించి మెప్పించిన ధూళిపాళగా పిలువబడే ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి జయంతి సెప్టెంబర్ 24.
ఇక ఆయన శకుని పాత్రలో... ''అని గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు, అనిమిత్త క్రోధంతో అసూయాగ్రస్థుడై రారాజు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఈ వెర్రి లోకం, ఒకవేళ నీవు పోకపోయిననూ యాగమా ఆగునది కాదు, పోయినచో స్వజనుల మీది సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది, ఎదుటి బలాన్నీ, బలగాన్ని కనిపెట్టే అదనూ చిక్కుతుంది. వేయేల కురుసార్వభౌముడు మానవీయుడూ, మంచివాడన్న కీర్తి నువ్వు దక్కించుకో, ఆపైన కొంచపు వంచన పనులన్నిటికీ అయిన వాడ్ని అమ్మ తమ్ముడ్నీ నేనున్నానుగా...
ముల్లుని ముల్లుతోటే తియ్యాలి, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి, కనుక హిత పురోహిత ధృత్య వాక్య సామంత దండనాయక వారవనితా జనతా నృత్య నాట్య కళావినోద మనోహరంబగు పరివారంబుతో, చతురంగ బలసమేతులై శతసోదర సమన్వితులై శీశ్రీశ్రీ గాంధారీసుతాగ్రజులు ఇంద్ర ప్రస్థానికి వెళ్ళవలసిందే, రాజసూయాన్ని సందర్శించాల్సివల్సిందే.." అంటూ రెండు అరచేతుల మధ్యా పాచికల్ని రాపాడి, పితుహూ... అని అరుస్తూ కుడిచేత్తో వాటిని ఎగరేస్తూ, ఎడమ చేత్తో గడ్డాన్ని దువ్వుకుంటూ, మూలగా మొహం పెట్టి ఎడమ కనుబొమ్మ విల్లులా వంచుతూ, కనీ కనిపించని ప్రతీకారేఛ్చతో మిళితమయిన క్రూరమైన నవ్వుతో శకుని గుర్తొస్తాడు.
సి.ఎస్.ఆర్, లింగమూర్తి వంటివారు పోషించి మెప్పించిన ఆ పాత్ర ప్రత్యేకతను ధూళిపాళ తనదైన శైలిలో, తనకి మాత్రమే సొంతమయిన హావభావ నటనా వైదుష్యంతో దానికి జీవం పోశారు. ఒక విధంగా ధూళిపాళ అంటేనే శకుని అనేంతలా, ఆయన తరవాత మరెవ్వరినీ ఆ పాత్రలోఊహించుకోలేని విధంగా.. ఎంత క్లిష్టమయిన పద సమాసమయినా, పెద్ద సంభాషణ అయినా ఇదెంతలే అన్నంత సులువుగా చెప్పి దానికి సరిపడినంత భావాన్ని ఒలికించడమే ఆయన ప్రత్యేకత.
బహుశా పూర్వాశ్రమంలోని నాటకానుభవం (ఆయన తన 14వ ఏట నుండే నాటకాలు వేయడం మొదలుపెట్టారు, చాలామందిలాగే ఈయనా స్త్రీ పాత్రతోటే) అంతా ఈ పునాది దిట్టానికి కారణం కావచ్చు. ఈ ప్రత్యేకత వల్లే రామారావు తన సొంత బేనరులో స్వీయ దర్శకత్వంలో తీసిన చిత్రం 'శ్రీకృష్ణ పాండవీయం'లో ఈయనకి అంతటి ప్రభనిచ్చే పాత్రనిచ్చి గౌరవించారు. (ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 'సీతారామ కల్యాణం') అందుకే అయినవాడ్ని అమ్మ తముడ్ని నేనుండగా నీకు దిగులెందుకని రారాజుకిచ్చిన మాట నిలపెట్టారు ఆ పాత్రకి జీవం పోసి. ఒక విధంగా ఆలోచిస్తే పౌరాణిక పాత్రల్లో దాదాపుగా అన్ని పాత్రలను(నాయకుడు, ప్రతినాయకుడు) వేసి మెప్పించి తెలుగు వారికి ఆరాధ్యుడయిన ఎన్.టి.ఆర్ వేయ సాహసించని పాత్ర ఇదొక్కటేనేమో?
1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలకు వెళ్లినప్పుడు ఆ పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి వీరి అభినయానికి ఆకర్షితులై సినిమాల్లో నటించమని సూచించడమే గాకుండా దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకు పరిచయం చేయడంతో 'భీష్మ' (1962) చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయం అయ్యారు దుర్యోధన పాత్రతో ధూళిపాళ. ఆ సినిమాలో భీష్ముడిగా ఎన్.టి.ఆర్ నటించారు. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు.
వాపీకూప తటాకనిధి నిక్షేపాదులన్నీ సమభోజ్యంగానూ పంచగా మిగిలినవి బడి, గుడి. ఇవి ఎవరికి ఇష్టమయితే వారి ఖాతాలో జమ చేద్దామని అంటూ (ప్రేమనగర్) దివాన్ జీలా చూసినా, రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా, నీ కోవెలా ఈ ఇల్లు కొలువైవుందువు గానీ, కొలువై వుందువుగానీ రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా రావమ్మా కృష్ణార్పణం- అంటూ హరిదాసుడయినా (ఉండమ్మ బొట్టుపెడతా) ఆయనకి ఆయనే సాటి. పాత్ర నిడివితో సంబంధం లేకుండా తనదైన ముద్ర వేయడమే అయన ప్రత్యేకత.
ఆయన ఎంత పెద్దనటుడయి చిత్రసీమలో స్థిరపడ్డా ఎప్పుడూ నాటక రంగాన్ని వీడలేదు. వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక పౌరాణికాన్ని వేస్తూ సేవ చేసారు. అందులో భాగంగానే 'శ్రీకృష్ణరాయబారం' నాటకాన్ని వందసార్లకు తక్కువ కాకుండా ప్రదర్శించి తన వంతుగా దుర్యోధన పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించారు. నాటక, సినీ రంగాల్లో ఆయన ప్రతిభకు నిదర్శనంగా ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాటక అకాడమీ వారి నాటక కళాప్రపూర్ణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆత్మగౌరవ పురస్కారం. తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగువెలుగులు ఉగాది పురస్కారం అందజేశారు. బాంధవ్యాలు చిత్రంలో ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవార్డు ప్రదానం చేసింది. అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారు సైతం 2007 ప్రతిభా పురస్కారానికి ధూళిపాళను ఎంపిక చేసింది.
తమిళ పత్రికలు సైతం ఆయనను ''నడిప్పిళ్ పులి నడత్తళ్ పసువు'' అని అభివర్ణించారు. అంటే నటనలో పులి, నడతలో (నిజ జీవితంలో)గోవు అని అర్ధం. ఇంకా సాంస్కృతిక సంఘాల సత్కారాలు ఎన్నో లభించాయి. ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ప్రశ్న, ఎలా బ్రతికామన్నది? ఎంతమంది మనం పోయిన తర్వాత మనని ఎలా గుర్తు పెట్టుకుంటారన్నది, అందుకు మనం ఏమి చేశామన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. అది మంచయినా చెడ్డయినా సరే.
అలాంటి ఆలోచనే ప్రాతిపదికగా నటరాజ సేవలో తరించిన ధూళిపాళ తనువు చాలించే పది సంవత్సరాల ముందు సినీ జీవితానికి స్వస్తి చెప్పి తనకున్న సంపదను త్యజించి ఆధ్యాత్మిక జీవితానికి తెర తీశారు. మానవ జన్మ విశిష్టత, అవసరాన్ని తెలుసుకుని తరించాలని భావించి మానవసేవే మాధవసేవ లక్ష్యంగా ఆయన సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక పథంలోకి అడుగుపెట్టారు. పుట్టిన జీవి ఎప్పటికైనా గిట్టక తప్పదని, 2001 మే 7న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు. అప్పటి నుంచి శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి పేరుతో వ్యవహారంలో ఉన్నారు.
గుంటూర్ మారుతీ నగర్‌లో మారుతి గుడి నిర్మించి, రామాయణం, సుందరాకాండలను తెలుగులోకి తిరిగి వ్రాశారు. ధూళిపాళ ట్రస్టును ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు, ధూళిపాళ కళావాహిని స్థాపించి కళారంగాన్ని ప్రోత్సహించారు. మూడున్నర దశాబ్దాల పాటు కళామతల్లికి సేవలందించి, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లేందుకు తన శేషజీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి ధూళిపాళ. ధూళిపాళ కొద్దికాలం ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడి 2007 ఏప్రిల్ 13 న మరణించారు.
ధూళిపాళగా పిలవబడే ఈయన పూర్తి పేరు ధూళిపాళ సీతారామ శాస్త్రి. ఈయన గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లిలో 1921 సెప్టెంబర్ 24న జన్మించారు. చిన్నప్పటి నుంచి రంగస్థల ప్రదర్శన పట్ల ధూళిపాళ ఎంతో మక్కువ చూపేవారు. బతుకుతెరువు కోసం గుంటూరులో కొద్దికాలం ప్లీడర్ గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్ థియేటర్‌ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక, గయుడి పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి. అలాంటి మహా నటుడికి జోహార్లు అర్పిద్దాం.