అమితాబ్‌ బచ్చన్‌ 66 ఏళ్ల యువకుడు...

భారతీయ సినిమా దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ 66వ సంవత్సరంలో అడుగు పెట్టారు. గత మూడు దశాబ్దాలుగా హిందీ చలన చిత్ర రంగంలో విజయాలకు, కీర్తి ప్రతిష్టలకు ప్రతీకగా శిఖరాయమానంగా వెలుగొందుతున్న బాలీవుడ్ రారాజు అమితాబ్ అరవయ్యేళ్లు దాటాక కూడా హిందీ చిత్ర పరిశ్రమను అప్రతిహతంగా ఏలుతున్నారంటే ఇది వృత్తి పట్ల ఆయన ఎంచుకున్న అవ్యాజా ప్రేమానురాగాలే తప్ప వేరొకటి కాదని విమర్శకులు కొనియాడుతున్నారు.

ఈ శనివారంతో 66వ జన్మదినం జరుపుకుంటున్న అమితాబ్ తన షూటింగులకు తాత్కాలిక విరామం చెప్పి దసరా, దీపావళి సెలవుల కోసం ఢిల్లీ విచ్చేసిన తన మనవరాళ్లతో గడపదలచుకున్నారు. అల్లాదీన్, షోయబితే సినిమాలు పూర్తి చేసిన బిగ్ బి ప్రస్తుతం లీనా యాదవ్ దర్శకత్వంలో తీన్ పట్టి చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు శనివారం తమ ఆరాథ్య దైవాన్ని సందర్శించుకోవడానికి ముంబైలోని ఆయన నివాస ప్రాంతం జల్సా భవంతికి బయట వేచి ఉంటుండగా వారి మనోగతాలను కథనాలుగా ప్రసారం చేసేందుకు అసంఖ్యాకంగా టెలివిజన్ చానెళ్లు అక్కడే వేచి ఉంటున్నాయంటే అమితాబ్ సెలబ్రిటీ విలువ ఏమిటో తెలుస్తుంది.

గత కొద్ది సంవత్సరాలుగా ఈ బాలీవుడ్ మేరునగధీరుడు తన జన్మదిన సందర్భంగా అభిమానులను పలకరించేందు కోసం తన నివాస భవంతినుంచి బయటకు రావడం అలవాటు చేసుకోవడంతో ఆప్రాంతంలో ప్రతిఏటా పర్వదినం లాంటి సందడి నెలకొంటోంది. ఈ సంవత్సరం అమితాబ్ చిత్రాలు నాలుగు విడుదల కావడంతో ఈ జన్మదినం ఒక ప్రత్యేకతను కూడా సంతరించుకుంది.

ఇటీవలే అమెరికా, యూరప్‌లలో నెలరోజులపాటు తన కుమారుడు, కోడలు అయిన అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్‌తో కలిసి అమితాబ్ నిర్వహించిన "ది అన్‌ఫర్‌గెటబుల్ టూర్" నిజంగా చిరస్మరణీయమైందే కాకుండా ప్రపంచంలో ఇంతవరకు జరగని అతి పెద్ద కచ్చేరీగా గుర్తింపు పొందింది అంటే ప్రపంచ ప్రేక్షకులలో అమితాబ్ హవా ఏమిటో తెలుస్తోంది.

అన్నిటికంటే మంచి తాజాగా అమితాబ్ ప్రారంభించిన బ్లాగ్ కూడా సంచలనంగా మారింది. ఇటీవలే ప్రారంభించిన అమితాబ్ బ్లాగ్ అత్యంత ఆదరణ పొందిన బ్లాగ్‌ జాబితాలలో చేరిపోయింది.

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ జీవితంలో వివాదాలు, విమర్శలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీ ప్రాంతంలో వ్యవసాయ భూమిని తాను రైతునని చెప్పుకుని చట్టవిరుద్ధంగా స్వాధీనపర్చుకున్నారని తనపై పెను ఆరోపణలు వచ్చాయి. తర్వాత అలహాబాద్ హైకోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందనుకోండి. మహారాష్ట్రలో మరో భూ వివాదంలో కూడా అమితాబ్ చిక్కుకున్నారు.

అయితే ఎన్ని వివాదాలు చుట్టుముడుతున్నా మూడున్నర దశాబ్దాల పైగా చలన చిత్ర చరిత్రలో, ప్రపంచంలో చెక్కుచెదరని శిఖర స్థాయిని అందుకున్న ఏకైక నటుడుగా అమితాబ్ చిత్ర ప్రస్థానం కొనసాగుతూనే ఉంది.

వెబ్దునియా పై చదవండి