ఒలింపిక్ బీచ్ వాలీబాల్ పోటీల్లో అమెరికా తన సత్తా నిరూపించుకుంది. అటు మహిళల విభాగంలో, ఇటు పురుషుల విభాగంలోనూ అమెరికా స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది.
బీజింగ్‌లో గురువారం జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో చైనాను చిత్తు చేయడం ద్వారా అమెరికా ముద్దుగుమ్మలు స్వర్ణాన్ని ఎగరేసుకు పోగా శుక్రవారం అమెరికా పురుషులు సైతం స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు.
అమెరికాకు చెందిన కెర్రీ వాల్స్, మిస్టీ మైట్రీనర్‌ల జంట చైనాకు చెందిన వాంగ్ జై, టైన్ జై జోడీని 21-18, 21-18 తేడాతో ఓడించడం ద్వారా మహిళల బీచ్ వాలీబాల్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. అలాగే శుక్రవారం జరిగిన పోటీలో అమెరికాకు చెందిన టోడ్ రోజెర్స్, పిల్ డల్హౌసర్‌లు బ్రెజిల్ జంటను చిత్తు చేయడం ద్వారా స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు.