కాంస్యంతో సరి : సెమీస్‌లో వెనుతిరిగిన విజేందర్

శుక్రవారం, 22 ఆగస్టు 2008 (13:31 IST)
భారత బాక్సింగ్ వీరుడు విజేందర్ కుమార్ బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. సెమీస్‌లో వెనుతిరగడం ద్వారా 75 కేజీల బాక్సింగ్ విభాగంలో విజేందర్‌కు కాంస్యం దక్కనుంది.

బీజింగ్‌లో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన 75 కేజీల మిడిల్ వెయిట్ క్వార్టర్స్ పోరులో క్యూబా బాక్సర్ ఎమిలియో బాయెక్స్ చేతిలో 8-5 తేడాతో ఓడిపోవడం ద్వారా తాజా ఒలింపిక్స్‌లో విజేందర్ పోరు ముగిసినట్టైంది. నాలుగు రౌండ్లలో జరిగిన క్వార్టర్ పోరులో ప్రారంభంలో విజేందర్ తడబడ్డాడు. దీంతో తొలి రౌండ్‌లో 0-2 తేడాతో విజేందర్ వెనకబడ్డాడు.

అయితే రెండో రౌండ్‌లో ప్రత్యర్థిపై కాస్త ఆధిపత్యం ప్రదర్శించిన విజేందర్ 3-4 తేడాతో కాస్త పుంజుకున్నాడు. కానీ మూడో రౌండ్లో ప్రత్యర్థి విసిరిన పంచ్‌లకు విజేందర్ దగ్గర సమాధానం కరువైంది. దీంతో ఈ రౌండ్లో విజేందర్ ఏకంగా 7-3 తేడాతో వెనకబడ్డాడు. ఇక చివరి నిర్ణయాత్మక రౌండ్లో విజేందర్ ప్రత్యర్థిపై కాస్త ఆధిక్యం కనబరిచి రెండు పాయింట్లు సాధించినా అప్పటికే సమయం మించి పోయింది.

దీంతో చివరకు ఈ పోరులో క్యూబా బాక్సర్ ఎమిలియో బాయెక్స్ 8-5తో విజయం సాధించాడు. అంతకుముందు క్వార్టర్స్ పోరులో ఈక్విడార్ బాక్సర్ గోంగోరాను ఓడించడం ద్వారా విజేందర్ సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. క్వార్టర్స్‌లో ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించడం ద్వారా విజేందర్ తన సత్తా ప్రదర్శించాడు. దీంతో 9-4 తేడాతో ప్రత్యర్థిపై విజేందర్ విజయం సాధించాడు.

వెబ్దునియా పై చదవండి