వసంత పంచమినే సరస్వతీ జయంతిగా పేర్కొంటారు. ఈ పర్వదినం తెలుగునాట అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నది. అక్షరానికి అధిదేవత అయిన సరస్వతీని ఈ రోజున సాయంత్రం పూట నేతి దీపమెలిగించి పూజించే వారికి సకల పుణ్యఫలాలు వుంటాయి. వాగ్దేవి ఉపాసన వల్లనే వాల్మీకి రామాయణ రచన చేశారు. శారద దీక్ష స్వీకరించి వ్యాసుడు వేదవిభజన చేయగలిగాడని చెప్తారు.
ఆదిశేషువు, బృహస్పతి, ఆదిశంకరులు, యాజ్ఞవల్క్యుడు వంటి ఎందరో శారదా అనుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులయ్యారు. వ్యాసుడు గోదావరి తీరాన సైకతమూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ క్షేత్రమే వ్యాసపురి, బాసరగా ప్రసిద్ధి చెందిందని పురాణాలు చెప్తున్నాయి.
ఈ రోజున సరస్వతీ దేవికి పూజ చేయడం.. రతీదేవికి, కామదేవునికి, వసంతుడికి పూజలు చేయడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున సాయంత్రం సరస్వతీ పూజ చేయాలి. వాగ్దేవికి కొత్త ధాన్యంతో వచ్చే బియ్యంతో పాయసం వండి నైవేద్యం పెట్టడం చేస్తే జ్ఞానం చేకూరుతుంది. ఆ జ్ఞానంతో అందరూ ఉన్నత స్థాయికి ఎదగడం చేయొచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో మంగళవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పండితులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. సాధారణ దినాల్లో ఉదయం ఏడున్నర గంటల నుంచి ప్రారంభమయ్యే అక్షర శ్రీకార పూజలను బుధవారం నుంచి 5 గంటలకే ప్రారంభిస్తున్నారు. అభిషేక పూజలను ఉదయం 3 గంటలకే జరుపనున్నారు. ఇలా పూజల్లో మార్పులు బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఉంటుంది.
వసంతి పంచమి నాడు సరస్వతీ మాత కటాక్షం కోసం ఆ దేవీ ఆలయాలను ఎందరో దర్శించుకుంటూ ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఈ ప్రత్యేకమైన రోజున అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలా మంది బాసరలోని సరస్వతి దేవి ఆలయానికి వెళ్తారు. అంతేకాకుండా మాటలు రాకపోయినా.. మాటలు నత్తిగా వస్తున్నా కూడా ఈ ఆలయానికి వెళ్తే అవన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు.
వసంత పంచమిని శుభప్రదంగా భావిస్తారు. ఇక ఉత్తర భారతంలో వసంత పంచమిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి, ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. అలాగే వివాహం కోసం కూడా ఈ వసంత పంచమిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ వసంత పంచమి నాడు తమ పిల్లలకు విద్య ప్రారంభానికి కూడా చాలా మంది శుభప్రదంగా భావిస్తారు.