అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతుంది. ఇది జ్యోతిర్లింగమని.. తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు.