కార్తీక మాసంలో అందులోనూ ప్రత్యేకించి సోమవారం నాడు ఆచరించే వ్రతం ఎలాంటి వారికైనా మహా పుణ్యాన్నిస్తుంది. ఇందుకు కర్కశ కథే ఉదాహరణ. పూర్వం నిష్ఠురి అనే మహిళ వుండేది. ఆమె ప్రవర్తన హేయంగా వుండటంతో ఆమెను కర్కశ అని అందరూ అంటుండేవారు. కాశ్మీర దేశానికి చెందిన ఆమె సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రశర్మ అనే మంచి వేద పండితుడిని పెళ్ళాడింది.
ఆమె దుర్మార్గ ప్రవర్తనతో భర్తను హింసించి., భయంకరమైన వ్యాధితో దీనస్థితిలో మరణించింది. ఆ పాప ఫలితంగా మరుసటి జన్మలో శునకంగా జన్మించింది. ఆమెకు ఓ కార్తీక సోమవారం నాడు పగటిపూట ఎక్కడా ఆహారం దొరకలేదు. చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతంలో భాగంగా ఉపవాసం వుండి సాయం సంధ్యా సమయంలో వ్రతం ముగించే విధానంలో భాగంగా ఆచారం ప్రకారం అన్నం ముద్దను ఇంటి ముంగిట వుంచాడు. ఆహారం దొరకని ఆ శునకం ఆ అన్నం ముద్దను తింది. వెంటనే దానికి గత జన్మ జ్ఞప్తికి వచ్చింది. దాంతో మానవ భాషలో వేద పండితుడికి గతాన్ని చెప్పింది.
ఎన్నెన్నో సోమవార వ్రతాలను చేసి పుణ్యం సంపన్నుడైన ఆ పండితుడు పరోపకార దృష్టితో ఒక సోమవార ఫలాన్ని దానికి ధార పోశాడు. వెంటనే శునక దేహాన్ని విడిచిపెట్టి దివ్య శరీరంతో కైలాసానికి చేరింది. ఇది స్కంధ పురాణంలో చెప్తున్న సోమవారం వ్రత కథ. ఈ వ్రతాన్ని చేసిన వాడికి కైలాస నివాసం లభిస్తుంది. కార్తీక సోమవారం నాడు చేసిన స్నానం, దానం, జపం అనేవి అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్నిస్తుంది.