కార్తికమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుద్ద చతుర్దశి తిథినే వైకుంఠ చతుర్దశి అంటాం. ఈ రోజున విష్ణుమూర్తితో పాటూ శివుడిని కూడా తప్పకుండా పూజించాలి. అలా పూజిస్తే మోక్షం పొందవచ్చు. చతుర్దశి తిథి నాడు విష్ణుమూర్తిని పూజిస్తారు. అయితే ప్రత్యేకించి ఈ వైకుంఠ చతుర్దశి తిథిని శివకేశవులకు ఇద్దరికీ సంబంధించిన తిథిగా చెప్పవచ్చు.
వైకుంఠ చతుర్దశి రోజు విష్ణువు ఆలయం లేదా శివాలయంలో దీపదానం చేయడం విశేషంగా చెప్పవచ్చు. అందులోనూ రాగి లేదా, ఇత్తడి లోహాలతో తయారు చేసిన కుందుల్లో దీపాలను వెలిగించి, వాటిని బ్రాహ్మణుడికి దక్షిణా పూర్వకంగా, మంత్రపూర్వకంగా దీపదానం చేస్తే మరుజన్మ ఉండదని పురాణ వచనం. ఈ విధంగా చేయడం వల్ల పూర్వజన్మలో, ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలిగిపోయి సమస్త శుభాలూ చేకూరుతాయని విశ్వాసం.