కుమార స్వామి ఆలయం ధ్వజస్తంభం వద్ద.. ఉప్పు, మిరియాలు ఎందుకు?

మంగళవారం, 28 మే 2019 (12:28 IST)
సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర భక్తులు ఉప్పు, మిరియాలు వదిలి వెళ్తూ ఉండడం చూస్తూనే ఉంటాము. అయితే, అలా ఎందుకు చేస్తారంటే... సుబ్రహ్మణ్య స్వామి కుండలినీ స్వరూపుడు. అందుకు సంకేతంగానే సర్పాకారంలో దర్శనమిస్తూ ఉంటాడు. మిరియాలు అంటే కారం. ఉప్పు, కారం మన నాలుకను ఆకర్షించే రెండు ప్రధానమైన రుచులు. 
 
యోగ సాధనలో రుచులపై మమకారం వదులుకోవటం ఒక భాగం. ఆ యోగమూర్తి సన్నిధిలో రుచులపై మోహం వదులుకుంటున్నామనీ, యోగమార్గంలోకి వస్తున్నామనీ తెలియచేయటానికి ఉప్పు, మిరియాలు ఉంచుతూంటారు. 
ధ్వజస్తంభ పీఠాన్ని.. బలిపీఠంగా భావిస్తారు. పక్షుల కోసం అర్చకులు అక్కడ అన్నం ఉంచడం ఆలయ సంప్రదాయం. ఆ పీఠం దగ్గర ఉప్పుకారాలు వదలడం రుచులపై ఆసక్తిని వదిలిపెట్టడమన్నమాట. 
 
మరో కోణంలోంచి చూస్తే.. సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానమూర్తి. జ్ఞాన సముపార్జనకు ప్రథమ స్థితి బ్రహ్మచర్యం.. ఉపనయన క్రతువులో నాందీ ముఖంలో బ్రహ్మచారికి ఉప్పుకారాలు లేని భోజనం వడ్డిస్తారు.


విద్యపై అభిరుచి తప్ప మరే ఇతర రుచులపై బ్రహ్మచారి ఆసక్తి కలిగి ఉండరాదన్నది బ్రహ్మచర్య వ్రతంలో భాగం. స్వామి బ్రహ్మచర్య వ్రతదీక్షను గౌరవిస్తూ భక్తులు ఇలా ఉప్పు, మిరియాలు వదలడం ఆచారంగా వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు