ఏరువాక పౌర్ణిమ.. రైతులకు శుభప్రదమైన రోజు..

గురువారం, 24 జూన్ 2021 (11:01 IST)
Yeruvaka pournima
ఏరువాక పౌర్ణిమ ఏరువాక అంటే రైతులు పొలం పనులు ప్రారంభించే సమయం. పొలం దున్నడానికి ఆరంభమని చెబుతారు. వర్షరుతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమనాడు రైతులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి, ఎడ్లను కట్టేకాడిని ధూపదీప నైవేద్యాలతో పూజించడం పరిపాటి. వీధులలో ఊరేగింపు నిర్వహిస్తారు. పోటా పోటీగా ఎద్దులతో ఏరువాక తాడును తెంచి ఉత్సవాలు జరుపుకుంటారు. ఏరువాక పౌర్ణిమ సాధారణంగా జూన్ మాసంలో వస్తుంది.
 
ఏరువాక పౌర్ణమి. అంటేనే రైతులకు శుభప్రదమైన రోజు. తమ కష్టాలు తీరాలని, పంటలు బాగా పండాలని భూమి తల్లికి పూజలు చేసుకొనే రోజు ఇది. తొలకరి జల్లులు కురిసిన తరుణంలో రైతులు ఈ పండుగను జరుపుకుంటారు.
 
విశేషాలు ఈ సందర్భంగా రైతులు ఉదయం గ్రామ సమీపంలో ఉన్న చెరువులు, కుంటల్లో ఎడ్లకు స్నానాలు చేయించి ఎద్దులకు వివిధములైన వస్తువులు తినిపిస్తారు. కొందరు కోడిగుడ్లను తాగిస్తారు. ఏరువాక పౌర్ణమి నుంచి వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. దీంతో పని ఒత్తిడికి గురయ్యే ఎద్దులకు బలం కోసం కోడి గుడ్లు మంచివని వారి అభిప్రాయం. 
 
వర్షాకాలంలో ఎద్దులకు ఎలాంటి రోగాలూ రాకుండా కొంతమంది వాటికి పసుపు, ఉల్లిపాయ, వాము, కోడిగుడ్డు తినిపించి సారాయి తాగిస్తారు. ఇలా చేయడం ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూమి తల్లికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను రంగులు, రకరకాల బట్టలతో అంకరించి డప్పులు, మేళతాళాలతో ఊరేగిస్తారు.
 
ఏరువాక సందర్భంగా గ్రామాలలో జాతర వాతావరణం నెలకొంటుంది. ఆషాఢ మాసం సందర్భంగా ఆడపడుచులు పుట్టింటికి రావడంతో రకరకాల పిండీవంటలు చేస్తారు. ముఖ్యంగా ఎడ్ల పందాల హోరు కనిపిస్తుంది.. సాయంకాలం గ్రామంలోని రైతులంతా మంగళవాద్యాలతో ఊరేగింపుగా పొలాలకు వెళ్లి దుక్కి ప్రారంభిస్తారు. ఊరి వాకిట గోగునారతో చేసిన తోరణం కడతారు. దాన్ని చెర్నాకోలలతో కొట్టి ఎవరికి దొరికిన పీచును వారు తీసుకుపోతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు