వీరభద్ర స్వామికి పులిహోరను సమర్పిస్తే.. నాభి స్థానంలో భద్రకాళి నోరు తెరుచుకుని?

శుక్రవారం, 25 మే 2018 (10:13 IST)
వీరభద్రుడు పేరు వినగానే పురాణాలలో పేర్కొనబడిన దక్షయజ్ఞ ధ్వంసం గుర్తుకు వస్తుంది. ఈ స్వామిని కొలవడం వలన పాపాలు తొలగిపోతాయనీ, కార్యానుకూలత లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివాంశంతో అవతరించడం వలన ఆయనకి ఎంతో ఇష్టమైన పులిహోర, పొంగలి, శనగలను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఆయనను శాంతింప జేయడానికి నిమ్మకాయల దండలను సమర్పించే ఆచారం కూడా కనిపిస్తుంది. 
 
శ్రీ వీరభద్రస్వామి భక్తులకు అభీష్ట ఫలాలను సిద్దింపజేసే కల్పవృక్షంగా భక్తులు భావిస్తారు. శ్రీ స్వామి వారి పవిత్రనామాన్ని ఏకాగ్రతతో జపిస్తే సకల పాపాలు పటాపంచలవుతాయని, శుభ సంపదలు, సంతాన సౌభాగ్యాలు సిద్ధిస్తాయనీ, నిఖిల పురుషార్థాలు ప్రాప్తిస్తాయనీ, సంతానం లేని స్త్రీలు చేతులలో కొబ్బరికాయలతో స్వామివారి ఎదుట దండ ప్రమాణం చేసి నేలపై సాగిలపడి వరమడిగితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. శ్రీస్వామివారు రౌద్రమూర్తి కావటం వల్ల, శ్రీ స్వామి వారి నాభి స్థానంలో భద్రకాళి నోరు తెరుచుకుని ఉండటం వల్ల గర్భవతులైన స్త్రీలు శ్రీ స్వామివారిని దర్శించకూడదనే నియమం ఇక్కడ ఉంది.
 
అల్లాడుపల్లె సమీపంలోని భద్రిపల్లెకు చెందిన చాగంరెడ్డి మునెమ్మ, పెద్ద గంగిరెడ్డి దంపతులు తమకు 45 సంవత్సరముల వయస్సు వరకు సంతానం లేక బాధపడుతూ శ్రీస్వామి వారిని దర్శించి ఒక మండలం దినాలు భక్తితో నిష్టగా సేవించి సంతానం కోసం వరమడిగారు. శ్రీ స్వామి వారి అనుగ్రహంతో కొన్నాళ్లకే వారికి వీరారెడ్డి అను పుత్రుడు జన్మించాడు. వీరారెడ్డి పుట్టుకతోనే ఇహలోక వాసనాదూరుడై అవధూత దిగంబర వీరయ్యగా పిలువ బడుతూ పల్లెల్లో సంచారం చేసేవాడు. 
 
1978లో సిద్ధి పొందిన వీరయ్య ఆరాధన ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తారు. అవధూత వీరయ్య శ్రీ వీరభద్రస్వామి వారి అంశమనీ, ఆయన సమాధి దివ్యమందిరాన్ని దర్శించిన వారికి ఆర్తినివృత్తి కలుగుతుందని చెబుతారు. శ్రీ స్వామివారు కుందూ నది నుండి బయలు వెడలేందుకు సారధ్యం వహించిన శ్రీమతి పోతెమ్మ, శ్రీపోతిరెడ్డి దంపతులు స్వామి వారి పాద పద్మాల్లో లీనమై సాయుజ్యం పొందారని భక్తుల విశ్వాసం.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు