కమలనాభాయ నమస్తే...!

కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. మహిమాన్వితమైనది. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే లేచి "కార్తీక దామోదరా" అంటూ స్మరిస్తూ పవిత్ర నదీ స్నానమాచరించాలి. అలా నదీ స్నానం కుదరని పక్షంలో దొరికిన జలాలతో స్నానం చేయాలి.

"నమః కమలనాభాయ నమస్తే జలశాయినీ 1
నమేస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే 2"
అనే మంత్రంతో అర్ఘ్యమిచ్చి...

"కార్తికేహం కరిష్యామి ప్రాతస్నానం జనార్ధన 1
ప్రీత్యర్థం తవ దేవేశ జలేస్మిన్ స్నాతుముద్యతః 1
తవ ప్రసాదాత్ పాపం మే దామోదర వినశ్యతు 2"
అనే మంత్రాలతో స్నానం చేసి...

"నిత్యేనైమిత్తికే కృష్ణ కార్తికే పాపనాశనే1
గృహాణార్ఘ్యం మయాదత్తం రాధయా సహితో హరే 2"
అనే మంత్రంతో తిరిగి అర్ఘ్యమివ్వాలి.

కార్తీక మాసమంతటా తెల్లవారు జామునే ఈ విధంగా స్నానం చేస్తే పుణ్యప్రదమని ఆర్యుల విశ్వాసం. అంతేకాకుండా కార్తీక మాస అరుణోదయ సమయాల్లో శివాలయంలో గానీ, విష్ణు ఆలయంలో గానీ గడిపితే పాపాలు తొలగి పోతాయి.

ఇలా... శివాలయ, కేశవాలయాల్లో గడపటం ద్వారా గోవుల్ని దానం చేసినంత ఫలం లభిస్తుందని ఐతిహ్యం. శివ, విష్ణు ఆలయాలు సమీపంలో లేని పక్షంలో ఏ దేవాలయంలోనైనా లేదా రావిచెట్టు మొదట్లోగానీ, తులసీ వనంలో గానీ వుండి భగవత్ స్మరణ చేయడం మంచిది.

వెబ్దునియా పై చదవండి