గురుగ్రహ దోష శాంతి కోసం ఏం చేయాలి?

FILE
మేష, సింహ, ధనుర్ మాసాల్లో.. ఆది, సోమ, మంగళ, గురువారాల్లో, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలు కలిసి వచ్చిన రోజు వైష్ణవాలయం పూజారిని రాత్రి 1.30 గంటలకు స్వగృహానికి పిలిపించాలి.

గృహ మధ్య హాలులో 9 మూరల పసుపు వస్త్రం పరిచి 9 దోసిళ్ళు శెనగలు పోసి, ఆ రాశిపై బంగారు లేక ఇత్తడి చెంబును కలశంగా స్థాపించి, కలశంపై అష్ట దిక్కులకు 8 తమలపాకులను పెట్టి, వాటిపై టెంకాయను పెట్టి, విష్ణు స్వరూపమగు పసుపు కుంకుమ రేఖలు నిలువుగా పెట్టి ఆ కలశం ఈశాన్య దిశాముఖంగా పెట్టాలి.

కలశం ఎదుట ఎవ్వరూ కూర్చోకూడదు. వాయువ్య ముఖంగా వైష్ణవాలయ పూజారిని, ఆగ్నేయముఖంగా గృహస్థుడు అతని భార్య కూర్చొనాలి. తర్వాత మమ శనివర్గ జాతస్య.. లగ్నజాతకానుసారేన.. స్థాన స్థితి గురుగ్రహ పరిహారార్థం శతృరుణరోగపీడ పరిహారార్థం అని సంకల్పించాలి.

ఆ కలశమునకు పురుష సూక్త, నారాయణ సూక్తులతో ఆవాహన చేసి గురుగ్రహ సహిత శ్రీకృష్ణపర బ్రహ్మణే నమః పంచామృత అభిషేకం కరిష్యే అని చెప్పి కలశము ముందు భాగాన ఇత్తడి తట్టలో గురు గ్రహ పంచలోహ విగ్రహము, శ్రీకృష్ణుని బంగారు లేక పంచలోహ విగ్రహము పెట్టి పంచామృతములతో అభిషేకించి, కృష్ణ సహస్ర నామ, అష్టోత్తరములతో గురు అష్టోత్తరముతో పూజలు చేయాలి.

ఇలా రాత్రి మూడు గంటల వరకు పసుపు పువ్వులతో గంధాక్షత్రలతో పూజించి ఉద్వాసన పలకాలి. కలశ సహితంగా శెనగలు పసుపు, పువ్వులు, పసుపు రంగు వస్త్రం, రూ. 9 దక్షిణ ఇచ్చే మొత్తం సంఖ్య 9 వచ్చేలా చూసుకోవాలి.

ఇలా భార్యాభర్తలచే పూజపూర్తయ్యాక .. ఆ దంపతులు పూజారికి అన్నింటిని దానంగా ఇచ్చి సాష్టాంగ దండప్రణామములు ఆచరించి ఆశీర్వాదం పొందాలి. తర్వాత రాత్రి మూడు గంటల ప్రాంతాన అయ్యవారిని స్వగృహము నుంచి సాగనంపాలి. గురు గ్రహ పీడా పరిహారార్థం చేసినది కావున తీర్థప్రసాదములు తీసుకోరాదు. తర్వాత స్నానము చేయాలి.

గమనిక : ఈ పూజా కార్యక్రమము, అయ్యవారికి ఇచ్చే దానం కార్యక్రమాలు రాత్రి 3 గంటలలోపుగా ముగించాలి.

వెబ్దునియా పై చదవండి