అనడమే తడవు ఒక హంస గుంపులో నుంచి బయటకు వచ్చింది. కాకి కూడా దాని వెనకాలే వెళ్లింది. రెండూ సముద్రం మీదుగా ఎగరడం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళ్తుంటే కాకి దానికి తన విన్యాసాలు చూపిస్తోంది. హంసను దాటిపోయి మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి ఎగతాళిగా హంసను పిలువడం, ముక్కు ముక్కు మీద మోపడం, జుట్టు రేపుకుని తిరగడం, ఈకలు ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులన్నీ చేసింది. హంస చిరునవ్వు నవ్వి ఊరుకుంది. కాసేపటికి కాకి అలసిపోయింది. అప్పుడు పొడుగ్గా ఎగసి పడమరకు పరుగెత్తింది హంస. కాకి మరి ఎగరలేక రొప్పుతూ బిక్కముహం వేసింది.
హంసను మించలేకపోగా ప్రాణ భీతితో తల్లడిల్లింది. అయ్యో నా అవయవాలన్నీ వికలమైపోయాయి. కాసేపు ఎక్కడైనా ఆగుదామంటే పర్వతాలూ, చెట్లూ లేవాయే. ఈ సముద్రంలో పడితే మరణమే శరణ్యం అనకుంటూ కిందికీ పైకీ లేస్తూ గుడ్లు తేలేస్తోంది. అది చూసిన హంస నీకు చాలా గమనాలు వచ్చాన్నావు కదా. గొప్పగొప్ప విన్యాసాలు చేస్తానన్నావు. ఒక్కటీ చూపవేమిటి అని అడిగింది.
కాకి సిగ్గుపడింది.
అప్పటికే అది సముద్రంలో దిగబడి పోవడానికి సిద్ధంగా వుంది. హంసతో... నా సామర్థ్యం ఏమిటో నాకు తెలిసి వచ్చింది. నన్ను రక్షించు అంటూ ఆర్తనాదాలు చేసింది. అలా చేస్తూనే సముద్రంలో పడిపోయింది. ఇది చూసిన హంస వెంటనే జాలిపడి తన కాళ్లతో కాకిని సముద్రం నుంచి పైకి లేపి సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఇంకెప్పుడూ ఇలా అహంకారానికి పోకు అని చెప్పి వెళ్లిపోయింది హంస. కాకి లెంపలేసుకుంది అంటూ యుద్ధభూమిలో కర్ణుడికి హితవు పలికాడు శల్యుడు.