అన్నమయ్య అద్భుత అర్థాలు... చదివి తీరాల్సిందే...

శుక్రవారం, 8 జూన్ 2018 (12:51 IST)
అన్నమయ్య తెలుగునాట పుట్టిన భక్తులలో ప్రముఖుడు. వేంకటేశ్వరస్వామి అత్యంత ప్రియ భక్తుడు. అన్నమయ్య తన కీర్తనలతో, భక్తితో శ్రీనివాసుని అనుగ్రహం పొందాడు. అన్నమయ్య శ్రీనివాసుని తత్వం ప్రతి ఒక్కరికి అర్ధమయ్యేలా కీర్తనలు వ్రాసాడు. పండితుడు తాను ఒక్కడే ముక్తుడైతే లాభం ఏంటీ... తన చుట్టూ ఉన్నా వేలకొలది అమాయకులను ఉద్దరించగలిగినప్పుడే ఆ పాండిత్యానికి సాధనమే మంత్రోపసానం సార్ధకత. అందుకే అన్నమయ్య తమ గురుదేవులు బోధించిన తిరుమంత్రాలను అందరికి చాటిచెప్పాడు. అన్నమయ్య కీర్తించిన వాటిలో కొన్ని చరణాలకు భావం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
 
కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతు కులమంతా ఒక్కటే 
అందరికి శ్రీహరే అంతరాత్మ
 
అందరికీ ఆ శ్రీహరి ఒక్కడే అంతరాత్మ స్వరూపుడుగా నిత్యమూ ప్రకాశిస్తున్నాడు. అందరూ జంతు స్వరూపులే. కొన్ని రెండు కాళ్లవి. కొన్ని నాలుగు కాళ్లవి. కొన్ని మాట్లాడతాయి. కొన్ని పలకవు. అయినా అన్ని జంతువుల్లోనూ ఆత్మప్రదీపం మాత్రం వెలుగుతూనే ఉంటుంది. అందుకే మనం పశువులం. స్వామి పశుపతి.
 
అనుగు దేవతలకును అలకామ సుఖమెుకటే
ఘన కీటకాది పశువుల కామ సుఖమెుకటే
దినమహో రాత్రములు తెగి ధనాడ్యునకొకటే
ఒవర నిరుపేదకును ఒకటే అదియు
 
స్వర్గంలో ఉన్న దేవతలు అమృతపానం చేసిన వారు. వారూ అప్సరసలతో కామసుఖాన్ని పొందుతున్నారు. చీమలు, ఈగలు, దోమలు మెుదలు పశువులన్నీ అదే సుఖాన్ని పొందుతున్నాయి. పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ పొందుతున్న కామసుఖం ఒకటే అయినపుడు ఇక తేడా ఏముంది. అలాగే రాత్రింబవళ్లు అనే విభాగము అందరికి ఒకటే. శుక్ల కృష్ణ పక్షాలకు, యౌవ్వన వార్ధక్యాలకు, జన్మ మృత్యువులకు సంకేతాలు ఈ రాత్రి పగలు. అవి అందరికీ సమానమే. దాన్ని ఏ ధనవంతుడు తన హోదాతో మార్చుకోలేడు.
 
కడిగి ఏనుగుమీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద పొలయు నెండొకటే
కడు పుణ్యులను పాప కర్మలను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మెుకటే.
 
ఈ లోకంలో పెద్ద జంతువు ఏనుగు. చాలా నీచ జంతువు కుక్క. ఏనుగుకు అంబారీ కట్టి రాజులే అధిరోహిస్తారు. అంత గొప్పది ఏనుగు. కాని కుక్కను అందరూ చీదరించుకుంటారు. ఎండ కాస్తున్నప్పుడు అదే ఎండ ఈ రెండు జంతువుల మీద పడుతుంది. ఒకే తీవ్రతతో పడుతుంది కూడా. అలాగే శ్రీ వేంకటేశ్వరుని దివ్యకటాక్ష వీక్షణం కూడా పుణ్యుల మీద, పాపుల మీద సరిసమానంగా ప్రసరిస్తుంది. శ్రీనివాసుని నామజపం చేయగానే ఎవరికైనా ముక్తి సిధ్దమే అవుతుంది. ఎందుకంటే ఆ నామ జపానికి ఎవరైనా అర్హులే. అలాగే బ్రహ్మబోధకు కూడా అందరూ తగినవారే. దీనిని అందరూ గమనించగలిగితే శ్రీవారి కృపకు పాత్రులవుతారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు