వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, వీరం భొట్లయ్య అనే పేరుతొ బనగానపల్లెలో 23 సంవత్సరాలు ఉండి కందిమల్లయపల్లెకి చేరి, వడ్రంగి పని చేస్తూ ఉండసాగారు. ఎప్పుడూ పూజా, జపతపాది కార్యక్రమాలలో నిమగ్నమయినట్లు కనిపించేవారు, గాని అప్పగించిన పనిని సకాలములో పూర్తిచేసి, అందజేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తుండేవారు. ఆ ఊరి జనులు, గ్రామ దేవతయైన పోలేరమ్మ జాతర జరపడానికి చందాలు వసూలు చేస్తూ, స్వామివారి వద్దకు వచ్చారు.చందా ఇస్తానని చెప్పి, వచ్చినవారందరినీ అమ్మవారి గుడి వద్దకు తీసుకుని పోయి, అమ్మవారికి నమస్కరించి, చుట్టముట్టించుకోడానికి అగ్గి కావాలని వారిని అడిగారు స్వామివారు.
చందా ఇస్తాననీ చెప్పి గుడికి తీసుకు వచ్చి చుట్ట కోసం అగ్గి అడగడంతో, వారికి కోపం వచ్చి నిరాకరించారు. వారి కోపం చూసి నవ్వుతూ, మీరు ఇవ్వకపోతే, పొలేరమ్మే అగ్గి ఇస్తుంది అని పలికి అమ్మవారిని పిలవడంతో, పోలేరమ్మయే స్వయముగా విగ్రహం నుండి వచ్చి, స్వామివారి చుట్టముట్టించి, అదృస్యమయ్యిoది. జరిగిన హఠాత్తు సంఘటనకి కొంత సేపు స్థానువులై, తేరుకొని స్వామివారి పాదాలపై పడి తమ అజ్ఞానంతో ప్రవర్తించిన తీరుకు మన్నించమని వేడుకున్నారు.
కొంతకాలానికి, కందిమల్లయపల్లె నుండి పెదకొమర్ల గ్రామం చేరుకున్నారు. ఒక దినమున ఆ గ్రామంలో పెద్దిరెడ్డి అనే వ్యక్తి శివైక్యమవగా, దేహాన్ని పాడిపై ఎక్కించి మరుభూమికి తీసుకొని వెళ్తుండగా, స్వామివారు అడ్డముగా వచ్చి ఆపి, బ్రతికున్న మనిషిని అలా తీసుకుని వెల్తున్నారేమిటి అనడంతో అందరూ పిచ్చివాడిని చూసినట్లు చూసి స్వామివారిని విదిలించారు. వాళ్ళు ఎంత దూషించిన, ఎంత గేలి చేసినా వినకుండా అడ్డంగా నిలబడి పాడిని దింపించారు. ప్రాణం వదిలాడనుకున్న పెద్దిరెడ్డి కూర్చున్నాడు. అంతట అక్కడున్న వారు స్వామి వారి మహిమను తెలుసుకుని, భక్తులుగా మారారు.
ఆ ఊరిలో కొందరు ఆకతాయిలు వారిలో ఒకడిని శవంలా పడుకోబెట్టి స్వామివారి చెంతకు తీసుకుని వచ్చి బోరున విలపిస్తున్నట్లు నటిస్తూ బ్రతికించమని ప్రాధేయపడ్డారు. ఎవరు చేసినఖర్మ వారునుభవించక తప్పదు నాయనలారా అని స్వామి వారు పలుకగా స్వామివారిని ఎగతాళి చేస్తూ పడుకున్న వాడిని లేప ప్రయత్నించారు. ఎన్ని చేసినా లేవలేదు. పరిస్థితి అర్థమయి, వాళ్ళు చేసీన తప్పుని తెలుసుకుని, పశ్చాత్తాపంతొ, తప్పు ఒప్పుకుని కాళ్ళావేళ్ళా పొడగా, ఎట్టకేలకు దీర్ఘ నిద్రలోనికి వెళ్ళి పోయిన వాడ్ని లేపి పంపించేశారు.
బ్రహ్మoగారు నవాబుకు మహిమ చూపుట
బ్రహ్మనందరెడ్డి విభూతి ధరించి స్వామివారి మహిమలు స్నేహితులకు చెబుతూ తిరిగ సాగాడు. ఒక రోజు అతను కోట ప్రక్కనుండి వెళుతుండగా అక్కడివారు దృష్టి ఎలా వచ్చిందని అడుగగా స్వామి వారి మహిమ వలన నేత్రములు వచ్చినవని చెప్పి, తన నేత్రములకు చూపు వచ్చిన వృత్తాంతము వివరించి చెప్పాడు. ఈ విషయము వాళ్లు, ఊరి నవాబు గారికి చెప్పగా, స్వామివారికి బనగానపల్లె నవాబు విందుకు ఆహ్వానిస్తూ వర్తమానం పంపగా, స్వామివారు మరుసటి రోజు కోటలో విందుకి వెళ్ళుటకు అంగీకరించారు.
ఆ మరునాడు కోట నుండి పూల పల్లకి రాగా, అందులో ఊరేగుతూ భక్తుల జయజయధ్వానాల మధ్య దేవిడికి చేరుకున్నారు. నవాబు సింహాసనము దిగి, స్వామివారికి ఎదురువెళ్ళి, సాదరంగా ఆహ్వానించి ఉచితాసనము మీద ఆసీనులను చేసాడు. స్వామివారిని పరిపరివిధాల స్లాఘిస్తూ, విందారగించమని ప్రాథేయపడ్దాడు. స్వామివారి అనుమతించగా, ఒక పళ్లెమునందు భక్ష్యములు పెట్టి, దానిపై పట్టువస్త్రము కప్పి స్వామివారి ముందమర్చి, ఆరగించమని అర్థించాడు. అంతట స్వామివారు మందహాసము చేస్తూ నీళ్ళతో ఆ పళ్ళెమును సంప్రోక్షించి, పట్టు వస్త్రము తొలగించి ఫలములనారగించసాగారు. పళ్ళెములో అమర్చి తెప్పించిన మాంసము, ఫలములుగా మారడం గమనించి, సంభ్రమాశ్చర్యాలకు లోనై, స్వామివారి పాదాలపైబడి పరీక్షించుటకు పళ్ళెములో మాంసము పెట్టివస్త్రము కప్పి తెప్పించినందుకు మిక్కిలి పశ్చాత్తాపముతో క్షమించమని వేడుకున్నాడు. స్వామివారు నవాబును లేవనెత్తి, నాయనా నీ అంతర్యమును ముందే గుర్తించాము, నీ శోధన వల్ల మరొకసారి మా మహిమను లోకమునకు తెలియునట్లు చేసి కృతార్ధుడవైనావు అని అతనిని ఆశీర్వదించి, తదనంతరము కాలజ్ఞాన విషయములు కొన్ని వినిపించారు.
వీరబ్రహ్మేంద్రస్వామి వారు గోవిందమ్మను పరిణయమాడుట
పెదకమర్లపాడు గ్రామంలో శివకోటయ్య అనే కమ్మరపు పని చేసుకునే విశ్వబ్రాహ్మణునికి గోవిందమ్మ అనే పుత్రిక ఉండెడిది. ఎన్ని సంబంధాలు వచ్చినా ఇష్టపడక నిరాకరించుచుండెడిది. వస్తున్న పెళ్లి సంబంధాలన్నీ నిరాకరించడానికి గల కారణమునకై ఆరా తీయగా, ఆమె సిగ్గు పడుతూ తలవంచుకుని తండ్రీ! నీ ప్రయత్నములన్నీ విరమించుకొండి. నాకు పతి కాగిలిన వాడు భక్తి జ్ఞాన సంపన్నుడైన సన్యాసి రూపమున సంచరిస్తున్న బ్రహ్మానందుడే, అతను మనింటికి వచ్చి నన్ను పరిణయమాడే సమయమాసన్నమయింది అని అనగా తల్లీ! లేకలేక కలిగిన నిన్ను, ఎంత గొప్పవాడైతే మాత్రం సన్యాసికిచ్చి ఎలా పెళ్ళి చేయగలను అని నిరాకరించాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహిమలు, బోధల గురించి ఎంతమంది ఎన్ని గొప్పలు చెప్పినా, బ్రహ్మేంద్ర స్వామిని అల్లుడిగా అంగీకరించడానికి అతని మనసు అంగీకరించలేదు.
స్వామివారు కలలో సాధు రూపములో దంపతులు ఇరువురికి దర్శనమిచ్చి తమ పుత్రికను వీరబ్రహ్మేంద్రస్వామికిచ్చి పరిణము చేయని ఎడల ఆమె ప్రాణము త్యజిస్తుందని హెచ్చరించారు. అయినా శివకోటయ్య మనసు మారలేదు. తల్లి కుమార్తెకు, భర్తకు నచ్చ చెప్పలేక తల్లడిల్లిపోతుంది. నుదుట బొట్టుతో, పెద్ద కొప్పుతో, మోచేతి వరకు రవికెతో, మెడలో పూసల దండతో, చంకన బుట్ట, చేత ఒక కర్ర పట్టుకొని తన ఇంటి ముందే సోది చెబుతానమ్మ సోది సోది. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. అంతా నిజమే చెబుతాను అంటూ అరుచుకుంటూ ఇంటి ముందే వెల్తుంటే, దక్షిణ ఇచ్చి ఇంట్లోకి పిలచి ఎక్కడి నుండి వచ్చావు అని అడిగింది, గోవిందమ్మ తల్లి. దానికి సోదమ్మ నాకు ఒక ఊరని ఏమున్నది, అంతానాదే , నాభర్త గుణాతీతుడు, నాకు ముగ్గురు మగ బిడ్డలు ఆరుగురు ఆడబిడ్డలు. సోది చెప్పుటకై పుట్టినవారము. లోకమంతా మా నివాసమే. సోది చెబుతాను విను, మీ అమ్మాయి ఓక సన్యాసి మీద మనసు పడింది. మీ పెనిమిటి దానికి నచ్చటం లేదు, ఇప్పటికే గోవిందమ్మ అన్నపానీయాలు సరిగా తీసుకోక చిక్కినది. పిల్ల కోర్కె తీర్చండి. అంతా మంచే జరుగుతుంది. లోక రక్షకుడే భర్తగా వస్తున్నాడు. దిగులు చెందక పిల్ల కోర్కె తీర్చండి. నా మాట అమ్మ వాక్కు. నిజమే చెబుతాను అని పలికి అదృస్యమయ్యిoది. గోవిందమ్మ తల్లికి మెలకువ వచ్చింది. చూస్తే తెలతెల వారుతుంది. తెల్లవారు జామున వచ్చిన కలలు నిజమవుతాయనుకుంటూ, భర్తకు తనకు వచ్చిన కల గురించి చెప్పింది. అంతట శివ కోటయ్య దంపతులు తాము మరి ఆలస్యము చేయుట పనికి రాదని తలచి తమ కుమార్తెను వీరబ్రహ్మేంద్రస్వామివారికిచ్చి అంగరంగవైభవంగా వివాహము జరిపించారు.
స్వామివారి కుటుంబ వృత్తాంతము
వివాహానంతరం వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అత్తారింట కొంత కాలముండి, సతి గోవిందమ్మను తీసుకొని కందిమల్లయపల్లె చేరుకున్నారు. అక్కడ కొన్నాళ్ళు తత్వము, బ్రహ్మ జ్ఞానము శిష్యులకు బోధిస్తూ గడిపి సతీసమేతముగా తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆ దంపతులు మార్గమధ్యమునందు ఋష్యాశ్రమములలో బస చేస్తూ, తాపసోత్తములతో చర్చలలో పాల్గొంటూ ఉత్తరాదిన కాశీ, ద్వారకాది సమస్త పుణ్యక్షేత్రములు దర్శించుకుని, దక్షిణాదిన రామేశ్వరము, చిదంబరము, కంచి, కాళహస్తి, తిరుపతి మొదలగు క్షేత్రములను దర్శించుకుంటూ శ్రీశైలము చేరుకున్నారు. కొంతకాలం శ్రీశైల మల్లికార్జునుని చెంత గడిపి, కందిమల్లయ్యపల్లెకి తిరిగి వచ్చి ఊరి ప్రజలు కట్టించిన మఠమునకు చేరుకున్నారు.
ఆ మఠం స్థావరంగా చేసుకుని శిష్యులకు జ్ఞానబోధ, కాలజ్ఞాన బోధ, తత్వ బోధ చేస్తూ గడప సాగారు. కాలక్రమమున సిద్ది లింగయ్య, గోవిందయ్య, శివరామయ్య, పోతులూరయ్య, ఓంకారయ్య అను మగ సంతానము, వీర నారాయణమ్మ అను పుత్రిక జన్మించారు. పెద్దవాడైన సిద్ది లింగయ్యను, స్వామివారి అత్తమామలైన శివ కోటయ్య దంపతులకు దత్తత ఇచ్చారు. మిగిలిన పిల్లలు పెరిగి యుక్తవయస్కులవగా, గోవిందయ్యకు గిరెమ్మను, శివరామయ్యకు పాపమ్మను, పోతులూరయ్యకు పార్వతమ్మను, ఓంకారయ్యకు లలణామణినిచ్చి వివిహము చేసారు. వీరనారాయణమ్మకు సద్గుణ సంపన్నుడూ, సర్వ ధర్మశాస్త్ర పారంగదుడూ, విద్యావేత్త అయిన తిరుమలాచార్యులిని తెచ్చి వివాహము చేసారు. స్వామి వారి సంతానమంతా మఠమునందుండి, మఠ నిర్వాహణకు సహకరిస్తూ భక్తుల మన్ననలు పొందుతూ ఉండేవారు. (ఇంకా వుంది)