నందికొండ అను నగరములో "పాపాఘ్ని" మఠమును 'విరాట్ విశ్వకర్శ' వంశోద్భవుడైన వీరభోజయాచార్యులు నిర్వహిస్తుండేవాడు. పరమ భక్తుడు, సకల వేద ఙ్ఞాన సంపన్నుడు, దయార్ద్ర హృదయుడూ అయిన వీరభోజయాచార్యులు మరియూ ఆతని ధర్మపత్ని 'వీర పాపమాంబ' కలిసి పాపాఘ్ని మఠమును అతిధిఅభ్యాగదుల మన్ననలు పొందునట్లు నిర్వహిస్తుండేవారు. వారు శ్రీ మద్విరాట్ విశ్వకర్శ యెక్క పరమ భక్తులు. ఒకనాడు భర్త ఇంట లేని సమయమున ఒక సాధువు వచ్చి "అమ్మా! మీరు త్వరలో ప్రారంభించబోయే పుణ్యక్షేత్ర సందర్శనలో సంతానభాగ్యము లేని మీకు పరమేశ్వరుని దివ్య కటాక్షవీక్షణములవలన దైవాంశసంభూతుడైన అవతార పురుషుడగు బాలుడు ఒక మహర్షి ప్రసాదముగా మీకు ప్రాప్తమవుతాడు.
అతడు త్రికాల జ్ఞానియై, లోకోద్ధారకుడై, సకలజన పూజ్యుడై విలసిల్లుతాడు" అని పలికి నిష్క్రమిస్తాడు. పతి వచ్చిన తరువాత సాధువు వచ్చి పలికిన మాటలు చెప్పి, పుత్ర ప్రాప్తి కొరకు తీర్థయాత్ర చేయుదమని ఆమె కోరికను వెలబుచ్చింది. దానికి వీరభోజాచార్యులవారు శుభముహూర్తం చూసుకుని యాత్ర ప్రారంభిద్దమని ఆమెకు తెలియజేసాడు కాని మఠం యొక్కపనుల వల్ల ప్రయాణము తాత్సారం చెయ్యసాగాడు.
ఒక నాడు వీరభోజయాచార్యులవారు సంధ్యావందనాది కార్యక్రమములు నిర్వహించుకుని మఠమునకు వెళ్ళగా మహా తేజోస్వరూపుడైన సాధువు ఈయన రాక కోసమే నిరీక్షిస్తున్నట్లు మఠములో ఉన్నాడు. అంతట ఆ సాధువు వద్దకు పోయి ప్రణమిల్లగా, "వీరభోజ్యా! నీకింకా తీర్థయాత్రకేగు సమయము చిక్క లేదా, తొందరలో తీర్థయాత్రకు బయలుదేరు. యాత్రలో ఒక అమూల్యమైన మణి ఒకటి ప్రాప్తించనున్నది, నా వాక్కు పొల్లు పోదు. ఇది సత్యము" అని నొక్కివక్కాణించి వెళ్లిపోయాడు. వంశకర్తయగు విశ్వకర్మాచార్యుడే వచ్చి కర్తవ్యబోధ చేసినట్లు తలంచి, తాను లేని సమయమున మఠ నిర్వహణకు ఆటంకము కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసి, సతీసమేతముగా ఒక శుభ ముహూర్తమున తీర్థయాత్రలకు బయలు దేరాడు.
పుణ్య క్షేత్రములు, రుష్యాశ్రమములు దర్శించుకుంటూ ఒక దినము సరస్వతీ నదీ తీరమున ఉన్న అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుకున్నారు. అత్రి మహర్షి వీరి రాక వ్రృత్తాంతము దివ్యదృష్టితో గ్రహించి, కొన్ని దినములు ఆశ్రమములో ఉండమని సలహా ఇచ్చారు. ఋషివర్యుని మాట శిరసావహించి దంపతులిరువురూ మహర్షి సేవ చేసుకుంటూ, నిత్య పూజలు చేసుకుంటూ ఆశ్రమములో గడిపసాగారు.
అలా కొన్ని నెలలు గడిచిన తరువాత, ఓక రోజు అత్రి మహర్షి, పాలు తాగే వయసున్న మంచి వర్చస్సు కలిగిన ఒక బాలుని తెచ్చి, బాలుని జన్మ వృత్తాంతమంతా తెలియజేసి ఆ పుణ్య దంపతులకు అప్పగించి, "నాయనా వీరభోజయ్యా!, అమ్మా వీరపాపమాంబా! వీరంభొట్లయ్య అని నేను నామకరణం చేసిన ఈ బాలుడు కారణ జన్మడు, దైవ కృప వల్ల పెంచే భాగ్యము మీకు దక్కింది, అపురూపముగా పెంచి పెద్ద చెయ్యండి. లోకోద్దారకుడై వెలుగొందుతాడు" అని చెప్పి మహర్షి, వీరంభొట్లయ్యను అప్పజెప్తాడు. అత్రి మహర్షి తనవద్ద బాలుడు ఉన్న కొద్ది కాలము వీరంభొట్లయ్య ప్రదర్శించిన మహిమలు చెబుతూ ఆశ్రమము బయట ఎండలో కూర్చొండగా సర్పము వచ్చి పడగవిప్పి బాలునికి ఎండ తగలకుండా చేసిన వృత్తాంతము విశదీకరించాడు. దంపతులిరువురూ మహదానందభరితులై వీరంభొట్లయ్యను తమ స్వగ్రామమైన నందికొండకు తీసుకొని పయనమయ్యారు.
వీరం భొట్లయ్య వారి బాల్య దశ
వీరభోజయాచార్య దంపతులు అత్రి మహర్షి ద్వారా ప్రసాదించబడ్డ బాల వీరంభొట్లయ్య వారిని తమ స్వస్థలమైన నందికొండ నగరమునకు తీసుకువచ్చి, పాపాఘ్ని మఠములో తమ బంధుమిత్ర హితుల సమక్షములో ఘనంగా దత్తత స్వీకరణ కార్యక్రమము జరిపించారు. పసితనమునుండే ఆ దివ్యాత్ముడు పద్మాసనమున ఆశీనుడై ధ్యానోర్ముఖుడవుతుండేవాడు.
వీరంభొట్లయ్యకు ఏడు సంవత్సరములు ప్రాయము వచ్చినంతనే విద్యాబుద్దులు నేర్పంచుటకు గురువు వద్దకు పంపించారు. అనతి కాలములోనే సకల విద్యలూ గ్రహించి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసారు. అయితే అతను బాల్యదశలో ఉండగానే తండ్రైన వీరభోజయ్యాచార్యులవారు జీవబ్రహ్మైక్య సిద్ది పొందారు. అందువల్ల బాల్యదశలోనే వీరంభొట్లయ్య వారికి పాపాఘ్ని మఠం బాధ్యతలు స్వీకరించవలసి వచ్చింది. కొన్ని దినములు పాపాఘ్ని మఠమును చక్కగా నిర్వహించి, అభివృద్ధి పరచి చుట్టుప్రక్కల గ్రామాలలో ఆ మఠమునకు మంచి పేరునార్జించారు. అయితే మఠ నిర్వహణ బాధ్యతల వల్ల తాను ఎంచుకున్న దైవ మార్గమునకు విఘాతము కలుగుతుందని భావించి, తల్లి యైన వీరపాపమాంబ వద్ధకు పోయి, తీర్థయాత్రలకు పోవుటకు సమ్మతిని అర్థించారు.
వీరపాపమాంబ తనయుని తలంపు విని తల్లడిల్లిపోయి తమ వంశాచారం ప్రకారం మఠం కార్యక్రమాలు చూసుకుంటూ, పెళ్లి చేసుకొని వంశోద్దరణ చేయుట ఉత్తమమని హితవు పలికింది. అయితే వీరంభొట్లయ్య వారు జీవుని చతుర్దశలు, సంఖ్యాయోగము గురించి వివరించి తల్లిని తన నిర్ణయానికి ఒప్పుకున్నట్లు చేసుకున్నారు. ఆమె ఒప్పుకున్న తరువాత యోగ మార్గము యొక్క గొప్పతనము, విధివిధానాలు వివరించి తన విరాట్ స్వరూప దర్శనభాగ్యాన్ని వీరంభొట్లయ్య వారు కలిగించారు. అమ్మవద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరారు.
శ్రీ విష్ణాంశ సంభూతుడైన వీరంభొట్లయ్య తన తల్లి వద్ద అనుమతి తీసుకుని, అప్పటివరకు ధరించిన సువర్ణ మణి భూషణములను త్యజించి శరీరమంతట విభూతి ధరించి, రుద్రాక్ష మాలలతో అలంకరించుకొని, కాషాయ వస్త్రములు ధరించి, ఒక చేత దండకమలమును, మరొక చేతిన జపమాల పట్టుకొని, పశ్చిమముఖుడై యాత్రనారంభించారు.
వీరంభొట్లయ్య గారు నందికొండ నుండి బయలుదేరి, మార్గమద్యములో మహానంది, ఓంకారము, శ్రీశైలము మొదలగు పుణ్యక్షేత్రములను దర్శించుకుంటూ, 'హరిపురము 'చేరుకున్నారు. ఆ పురమున కొన్నాళ్ళు ఉండదలచి ఒక నిర్జన ప్రశాంత ప్రదేశమునెంచుకుని ఒక స్థావరమేర్పరుచుకున్నారు. కాశీ నగరమునకు రాజైన 'ఆనందభైరవ యోగి అడవిలో వేటాడుతుండగా పులి నుండి గోవును రక్షించడానికి శరమును సంధించగా గురి తప్పగా ఆవు మరణించింది. అంతట తనకు గోహత్యామహా పాతకము చుట్టుకున్నదని భావించి, ఆ పాపము నుండి విముక్తుడవడానికి, తరుణోపాయము సూచించగల మహనీయునికై వెతుకుతూ, వెతుకుతూ హరిపురములోనున్న వీరంభొట్లయ్య గారిని దర్శించుకుని తన గోడు వెళ్ళబుచ్చాడు.
వీరంభొట్లయ్య స్వామి వారు ఆనందభైరవునికి అభయమిచ్చి, మహామంత్రమైన "ఓం-హ్రీం-క్లీం-శ్రీం శివాయ బ్రహ్మణే నమః"ను ఉపదేశించి, కాశీ రాజ్యము పోయి ధర్మబద్ధముగా పరిపాలిస్తూ, ఉపదేశించిన ద్వాదశాక్షరీ మంత్రమును నియమనిష్ఠలతో క్రమం తప్పకుండా స్మరించమని బోధించారు. ఈ మంత్రము ఎవరైతే నియమనిష్ఠలతో క్రమం తప్పకుండా పూజిస్తారో వారు సర్వపాపములు నుండి విముక్తులై, ఆనందైశ్వర్యములతో వెలుగొందుతారని వివరించారు. తరువాత ఆనందభైరవయోగితో "ఆనందా! నీవు శివుని అంశంలో జన్మించిన వాడవు, మరు జన్మలో మహమ్మదీయ వంశమున జన్మించి, నాకు శిష్యుడివై 'సిద్దుడు' అను నామమున ప్రసిద్దుడవై నా బోధనలను మరియు నాచే రచించబడిన కాలజ్ఞానాన్ని వ్యాపింపజేస్తావు" అని సెలవిచ్చారు. - (ఇంకా వుంది)