ఆత్మ వెళ్లిపోగానే ఏడుపు వస్తుంది, మరి శరీరంలో వున్నప్పుడు ఆనందం వస్తోందా?

శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (22:15 IST)
మనిషి చనిపోగానే అందరూ ఏడుస్తారు. ఆత్మ ఆ శరీరంలో నుంచి వెళ్లిపోయిందని అందరూ అంటారు. అంటే శరీరంలో నుండి ఆత్మ వెళ్లిపోగానే ఏడుపు వస్తుంది. మరి శరీరంలో ఆత్మ వున్నప్పుడు ఆనందం వస్తోందా? లేదు, ఎందుకని?
 
ఎందుకంటే.. అది పోయిన తర్వాతే దాని విలువ తెలుస్తుంది. ఇది అచ్చం ధన నష్టం జరిగిన తర్వాత ధన మహిమ తెలియడం వంటిది. నిజానికి మనకి కనిపించే దేహబలం, మనోబలం, బుద్ధిబలం కేవలం మన అసలైన శక్తిలో 10 శాతం మాత్రమే. మిగిలిన 90 శాతం ఆత్మబలానికే చెంది వుంటుంది.
 
అదే మనిషికి అందకుండా మిగిలిపోతుంది. ఆత్మబలాన్ని గుర్తించడం ఎలా అనేది ఇప్పుడు మనకు కలిగే ప్రశ్న. మనసుకు వచ్చే అనుమానాలను, బుద్ధికి వుండే పరిమితమైన ఆలోచనలను వదిలిపెట్టి ఆత్మస్వరూపునిగా మీకు కావలసినదేమిటో నిర్ణయించుకుని దానిని సాధించాలనే తీవ్రమైన తపనను పెంచుకోవడమే ఆత్మబలాన్ని జాగృతం చేసుకోవడానికి మార్గం.
 
భూమిలో విత్తును నాటితే దానికి సరిగ్గా నీళ్లు పోస్తే కొన్ని రోజులకు మొలక తప్పకుండా వస్తుంది. భూమి ఆత్మలాంటిది. అది చైతన్యంలో వుంటుంది. ఎప్పుడైతే తీవ్ర సంకల్పంతో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసికొని ఎటువంటి అవమానాలు లేకుండా ఉంటామో, ఏవైతే అవసరమైన కార్యాలు చేస్తామో అప్పుడు ఆత్మబలం జాగృతమై లక్ష్యాన్ని తప్పకుండా నెరవేరుస్తుంది. ఈ కార్యక్రమాన్ని చిన్నచిన్న లక్ష్యాలతో ప్రారంభించి పెద్దపెద్ద లక్ష్యాలను సాధించడంలో ఆత్మబలం మహోన్నతంగా జాగృతం అవుతుంది. భగవద్గీత మనకు ప్రసాదించే అద్వితీయమే ఆత్మబలం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు