శ్రీవారి ప్రసాదం ధర పెంపు? క్లారిటీ ఇచ్చిన తితిదే చైర్మన్

ఠాగూర్

శుక్రవారం, 17 అక్టోబరు 2025 (15:55 IST)
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఒకటైన శ్రీవారి లడ్డూ ప్రసాదం ధర పెంచబోతున్నారంటూ విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనిపై తితిదే చైర్మన్ బీఆర్ నాయుడు వివరణ ఇచ్చారు. శ్రీవారి లడ్డూ ధరను పెంచే ఆలోచన తమకు ఏమాత్రం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారం, అవాస్తవమని ఆయన తేల్చి చెప్పారు. 
 
కొన్ని బాధ్యతారహిత మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తితిదే ప్రతిష్టకు, ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి నిరాధారమైన కథనాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 
 
భక్తులు ఎవరూ ఈ వదంతులను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పవిత్రమైన తిరుపతి లడ్డూ ప్రసాదం ధరను పెంచే ప్రతిపాదన తితిదే వద్ద ఎపుడూ లేదని, భవిష్యత్‌లో కూడా అలాంటి ఆలోచన చేయబోమని బీఆర్ నాయుడు పునరుద్ఘాటించారు. తితిదేపై బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే కొందరు ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు