నేడు శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి... భారతీయ శ్రామిక దినోత్సవం, వెంకయ్య మాట కరెక్ట్...

శనివారం, 17 సెప్టెంబరు 2016 (16:59 IST)
ఋగ్వేదంలోను, కృష్ణ యజుర్వేదంలోను, శుక్ల యజుర్వేదంలో విశ్వకర్మను సృష్టి కర్తగా చెప్పబడింది. అధర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడింది. పురుష సూక్తంలో విరాట్ పురుషునిగా కీర్తించబడినాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖునిగా అన్ని వేదాలలో విశ్వకర్మ వర్ణించూడినాడు. సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త. వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి. సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమితశక్తి కలవాడు కనుకనే ఋగ్వేదం ఆయనను భగవంతునిగా పరిగణించింది. 
 
మహాభారతము విశ్వకర్మను వేయి కళలకు అధినేతగా అభివర్ణించింది. విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకంను నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థను నిర్మించాడు. 
 
సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్ధ శిల్పకారులు ఐదుగురు ఉన్నారు. వీరు విశ్వకర్మకు జన్మించారు. 1. కమ్మరి అయోకారుడు – ఇనుము పని 2. సూత్రకారుడు (వడ్రంగి) వర్ధకుడు – కొయ్యపని 3. కాంస్యకారి(కంచరి) తామ్రకారుడు – రాగి, కంచు, ఇత్తడి పని 4. స్తపతి(శిల్పి) శిల్పకారుడు – రాతిపని 5. స్వర్ణకారి స్వర్ణకారుడు – బంగారు పని.
 
విరాట్ విశ్వకర్మ భగవానుడు ఐదు ముఖములు కలవాడు. విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాల నుండి మను, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు. ఈ పంచబ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు( సనగ, సనాతన, ఆహభౌసన, ప్రత్నస, సుపర్ణస) విశ్వబ్రాహ్మణులు  ఉద్భవించారు.  వీరి ద్వారా చేయు శాస్త్రం మరియు వృత్తులు నిర్ధేశింపబడినవి.  
 
మూలాధారం, విశ్వకర్మ ముఖము మహర్షి / గోత్రరిషి శాస్త్రం
1.      శివుడు మును సానగ బ్రహ్మర్షి తర్కం అయో శిల్పి – కమ్మరి
2.      విష్ణువు మయ సనాతన బ్రహ్మర్షి వ్యాకరమం దారు శిల్పి – వడ్రంగి/ సూత్రకారుడు
3.      బ్రహ్మ త్వష్ట అహభువన బ్రహ్మర్షి ధర్మశాస్త్రం తామ్రశిల్పి – కాంస్య కారి(కంచరి)
4.      ఇంద్ర దైవజ్ఞ ప్రత్నస బ్రహ్మర్షి మీమాంస శిలాశిల్పి – స్తపతి(శిల్పి)
5.      సూర్య విశ్వజ్ఞ సుపర్ణస బ్రహ్మర్షి వైధ్యం, జ్యోతిష్యం స్వర్ణశిల్పి – స్వర్ణకారి
 
లోకంలోని రకరకాల వృత్తులకు ఆద్యుడైన విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు. మేడే మనకు శ్రామిక దినోత్సవం కాదని, విరాట్ విశ్వకర్మ జయంతే భారతీయులకు శ్రామిక దినోత్సవం అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను చాలామంది సమర్థిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి