* భక్తుల శివనామస్మరణ నడుమ దివికేగిన పోలి....
* పుణ్యస్నానాలు, కార్తీకదీపాలతో అలరారిన స్నానఘాట్లు
* ముగిసిన కార్తీక మాసం
విజయవాడ: పవిత్రమైన కార్తీక మాసం ఆఖరి రోజు (పాఢ్యమి తిధి)ని పురస్కరించుకుని విజయవాడలోని కృష్ణా తీరం శోభాయమానంగా మారింది. నగరంలోని స్నాన ఘాట్లన్ని పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల రద్దీతో సందడి నెలకొంది. కార్తీక మాసం చివరి రోజున భక్తులు పవిత్ర కృష్ణా తీరంలో భక్తిశ్రద్ధలతో పూజాధికాలు చేయడంతో పాటు అరటిడొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదిలి పోలిని స్వర్గానికి పంపించారు. శివ.. శివ, హర..హర నామస్మరణ చేస్తూ భక్తులు శివకేశవులను ఆరాధించారు.
నగరంలోని దుర్గాఘాట్, పద్మావతి ఘాట్, పున్నమీఘాట్‌ల వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. స్నానఘాట్ల వద్ద పూజాధికాలు నిర్వహించి కార్తీక దీపాలను నదిలోకి విడిచిపెట్టారు. నింగిలోకి ఆకాశదీపాలు వదిలారు. ముత్తైదువులు ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. కృష్ణవేణి మాతకు పవిత్ర హారతులు పట్టారు. పేదలకు వివిధ రూపాల్లో దానాలు సమర్పించారు.
గోమాతలకు పూజాధికాలు నిర్వహించారు. రావిచెట్లు, వేపచెట్ల వద్ద పవిత్ర కార్తీకదీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజాధికాలు నిర్వహించారు. బ్రాహ్మణులకు స్వయంపాకాన్ని దానం చేశారు. శివాలయాలన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దుర్గామల్లేశ్వరులను దర్శించుకుని పవిత్ర కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక దీపాల వెలుగులో కృష్ణాతీరం శోభాయమానంగా వెలుగొందింది.