రైలు ప్రయాణికులకు అలెర్ట్ : 25 నుంచి అమలు

ఠాగూర్

శుక్రవారం, 22 ఆగస్టు 2025 (14:40 IST)
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ప్యాసింజర్ రైళ్ల సర్వీసుల నంబర్లలో మార్పులు చేసింది. కొన్ని ముఖ్యమైన మార్గాల్లో నడిచే రైళ్ల నంబర్ల మార్చడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు పాత్ కోచ్‌ల స్థానంలో ఆధునిక మెమూ కోచ్‌లను ప్రవేశపెడుతున్నారు. ప్రయాణికులు ఈ కొత్త మార్పులను గమనించాలని రైల్వేశాఖ సూచన చేసింది. 
 
కాచిగూడ - వాడి మధ్య ప్రయాణించే ప్యాసింజర్ రైలు (57601/57602) నంబర్లను 67785/67786గా మార్చినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త నంబర్లు ఈ నెల 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. అదేవిధంగా కాచిగూడ - రాయచూర్ ప్రాంతాల మధ్య నడిచే ప్యాసింజర్ రైలు నంబరును 67787/67788గా మార్చినట్టు తెలిపింది. 
 
ఈ నంబర్ల మార్పుతోపాటు కోచ్‌లలో కూడా కీలక మార్పులు చేస్తున్నారు. కాచిగూడ - వాడి ప్రాంతాల మధ్య నడిచే రైలులో ఉన్న ఐసీఎఫ్ కోచ్‌ల స్థానంలో ఆధునిక మెమూ రేక్‌ను, అలాగే, కాచిగూడ - రాయచూర్ మార్గంలో డెమో స్థానంలో కూడా మెమూ రేక్‌ను వినియోగించనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. 
 
మరోవైపు, మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్లే ప్యాసింజర్ రైలు (77648) రాక సమయాన్ని కూడా స్వల్పంగా మార్చారు. గతంలో ఉదయం 10 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకునే ఈ రైలు ఇకపై 10.20 గంటలకు చేరుకుంటుందని, ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, కొత్త నంబర్లు, సమయాలకు అనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు