ఇంట్లో పాలు కాచేటప్పుడు పొంగి వృధా అవుతుందా? అయితే అలా పాలను పొంగించి వృధా చేయడం కూడదని పండితులు అంటున్నారు. పాలను పొంగించి వృధా చేయడంతో పాటు అప్పుడప్పుడు పాలు చెడిపోయినట్లైతే... ఆ ఇంట లక్ష్మీ కటాక్షం ఉండదని వారు హెచ్చరిస్తున్నారు. పాలను కాచే పాత్రలు శుభ్రంగా ఉండాలని.. పాలు చెడిపోకుండా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు.
శుక్రవారం పూట ఉప్పు తీయడం ద్వారా అదృష్టం ఇంటిని వెతుక్కుంటూ వస్తుందట. సకల ఐశ్వర్యాలు చేకూరుతాయట. అయితే శుక్రవారం అప్పు ఇవ్వడం, బియ్యం వేయించడం, బియ్యాన్ని శుభ్రం చేయడం వంటి పనులు చేయకూడదు. మంగళ, శుక్రవారాల్లో మహిళలు తలంటు స్నానం చేయాలి. మహిళలు శనివారం పూట తలంటు స్నానం చేయరాదు. ఇంటికి వచ్చే సుమంగళి మహిళలకు వాయనం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. వాయనంగా తమలపాకు, పసుపు, కుంకుమ, పువ్వులు వీలైతే రవికెతో వాయనం ఇవ్వొచ్చు.
దక్షణగా రూపాయిని వుంచి వాయనం ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా సూర్యోదయానికి ముందే మహిళలు నిద్రలేవాలి. ఇంటి ప్రధాన ద్వారా తెల్లవారున తెరిచేటప్పుడు మూడుసార్లు లక్ష్మీదేవి రా తల్లీ అంటూ పిలవాలి. ఉదయం 4.30 నుంచి 6.00 గంటల్లోపే ఇంటి ముందు శుభ్రం చేసి రంగవల్లికలతో అలంకరించుకోవాలి. తద్వారా మహాలక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. ఉదయం, సాయంత్రం 6 గంటలకు ముందే ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. సాయంత్రం దీపం పెట్టిన వెంటనే ఈ ఇంటి ఇల్లాలు వెలుపలికి పోకూడదు.
ఆరు గంటలకు పైన తలదువ్వడం, ముఖం కడగడం చేయకూడదు. రాత్రిపూట పాలు, పెరుగు, పచ్చని కూరగాయలు అప్పుగా ఇవ్వడం, అప్పుగా తీసుకోవడం చేయకూడదు. మహిళలు నుదుటన ఎప్పుడూ కుంకుమం ఉండేలా చూసుకోవాలి. ఇంటికొచ్చే సుమంగళీ మహిళలకు కుంకుమ ఇచ్చేముందు.. ఇంటి ఇల్లాలు తన నుదుటన కుంకుమ పెట్టుకున్న తర్వాతే వారికి ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు.