సనాతన ధర్మంలో పితృ కర్మలు అనేది కేవలం సంప్రదాయంగానే కాకుండా, వాటి వెనుక లోతైన ఆధ్యాత్మిక, తత్వశాస్త్రపరమైన నమ్మకాలు ఇమిడి ఉన్నాయి. పితృ కర్మలు నిర్వహించడం అంటే మనకు జన్మనిచ్చిన, జీవితాన్ని ప్రసాదించిన పూర్వీకుల పట్ల కృతజ్ఞత, గౌరవం చూపించడం.
2025 సెప్టెంబరు 21న పితృపక్షం ముగింపు రోజు, అంటే మహాలయ అమావాస్య రోజున సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ అరుదైన ఖగోళ సంఘటనకు చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు సంఘటనలు ఒకే రోజు రావడం సుమారు 100 సంవత్సరాల తర్వాత జరుగుతుంది.
ఐతే 2025 సెప్టెంబర్ 21న ఏర్పడే సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది ప్రధానంగా దక్షిణార్ధగోళంలోని దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. అయితే, గ్రహణం కనిపించకపోయినా, జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం దాని ప్రభావం ఉంటుంది. పితృపక్షంలో చివరి రోజు మహాలయ అమావాస్య పూర్వీకులకు అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున పితృ దేవతలు భూమిపైకి వచ్చి తమ వారసుల ఆశీస్సులను స్వీకరిస్తారని నమ్ముతారు. ఈనాడు శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, పిండ ప్రధానం చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మలకు మోక్షం లభిస్తుందని, కుటుంబానికి వారి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు.
సాధారణంగా ఏ నెలలోనైనా అమావాస్య రోజున పితృ కర్మలు నిర్వహిస్తారు, కానీ మహాలయ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున కర్మలు చేస్తే, గతించిన పూర్వీకుల మరణ తిథి తెలియకపోయినా వారందరికీ ముక్తి లభిస్తుందని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున సూర్య గ్రహణం ఏర్పడటం వల్ల దాని శక్తి మరింత పెరుగుతుందని, అందువల్ల ఈ రోజు చేసే పితృ కర్మలకు అత్యధిక పుణ్యం లభిస్తుందని నమ్మకం.
గతించిన పూర్వీకుల ఆత్మలు తిరిగి జన్మను పొందే ప్రక్రియలో ఉంటాయని, ఈ కర్మలు చేయడం వల్ల వారి ఆత్మలు ఈ ప్రక్రియలో సులభంగా ముందుకు సాగడానికి సహాయపడుతుందని నమ్ముతారు. సరైన పద్ధతిలో కర్మలు చేస్తే, ఆ ఆత్మలు మోక్షాన్ని పొందే అవకాశం ఉందని, తద్వారా వాటికి పునర్జన్మ బాధలు ఉండవని భావిస్తారు.
పితృ కర్మలు సక్రమంగా నిర్వహించకపోతే, అది పితృ దోషానికి దారితీస్తుందని నమ్ముతారు. ఈ దోషం వల్ల కుటుంబంలో సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక కష్టాలు వంటివి వస్తాయని అంటారు. కర్మలు సరిగ్గా చేయడం వల్ల ఆ దోషాలు తొలగిపోయి, కుటుంబానికి మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.
ఇక పితృ కర్మలలో పాటించే పద్ధతులు విషయానికి వస్తే... పితృ కర్మలలో పిండ ప్రదానం వుంటుంది. పిండం అంటే బియ్యం, నువ్వులు, తేనె వంటి పదార్థాలతో కలిపి చేసే ముద్ద. ఈ పిండాలను పూర్వీకులకు ఆహారంగా భావిస్తారు. వీటిని నైవేద్యంగా పెట్టి, తర్వాత వాటిని నదిలో కానీ, గోవులకు కానీ తినిపిస్తారు.
ఆ తర్వాత తిల తర్పణం చేస్తారు. తిలలు అంటే... నల్ల నువ్వులు. వీటిని నీటితో పూర్వీకులకు అర్పణ చేస్తారు. దీనిని తర్పణం అంటారు. తిలలు శుభ్రతకు, పాపాలను తొలగించడానికి ప్రతీకగా భావిస్తారు. తర్పణం చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు. అనంతరం కర్మలలో భాగంగా బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం, వస్త్రదానం చేస్తారు. ఈ దానాల ద్వారా లభించే పుణ్యం పూర్వీకులకు చేరుతుందని భావిస్తారు. పితృ కర్మలు అనేవి మరణం తర్వాత పూర్వీకుల ఆత్మలకు మాత్రమే కాకుండా, జీవించి ఉన్నవారికి కూడా ఒక ఆశీర్వాదంగా, సంతోషంగా ఉండటానికి సహాయపడుతుందని విశ్వసిస్తారు.