అలాగే సంతానయోగం, వివాహ యోగం చేకూరుతుంది. అలాగే బుధవారం పూట శివపార్వతుల పూజ ఆయురారోగ్యాలను, కుటుంబంలో ఐక్యతను ప్రసాదిస్తుంది. ఈ రోజున పంచాక్షరీ మంత్రాన్ని ప్రదోష వేళలో 108 సార్లు పఠించడం ద్వారా శివానుగ్రహం లభిస్తుంది.
ఈ రోజున నందీశ్వరుని గరిక మాల సమర్పించడం ద్వారా అడ్డంకులు తొలగి కార్యానుకూలత చేకూరుతుంది. అలాగే శివుడిని పూజించడం ద్వారా జ్ఞానం, మనోబలం చేకూరుతుంది. ప్రదోష వ్రతం నాడు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తే భక్తుల కోరికలు తప్పకుండా నెరవేరతాయని నమ్ముతారు.
దోషాలను హరించే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోషకాలం అంటారు. సూర్యుడు అస్తమించే సమయంలో తిథి మారితే అది ప్రదోషకాలం. ప్రదోషకాలం రాత్రికి ప్రారంభం వంటిది. ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్థనారీశ్వరునిగా అతిప్రసన్నుడై దర్శనమిస్తాడు. మన పాపకర్మ ఫలమును నిర్జీవం చేయాలంటే, దానికి తగ్గ పుణ్య కర్మలు చేయాలి. ఈ త్రయోదశీ ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము.
ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా “అర్థనారీశ్వరుడుగా” దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. వ్రతం ఆచరించేవారు త్రయోదశి నాడు ఉదయాన స్నానమాచరించి శివుని పూజించి శివనామ స్మరణతో సూర్యాస్తమయం వరకు గడపాలి. ఉపవాసం చేయలేనివారు పాక్షిక ఉపవాసం జరపవచ్చు అంటే పాలు, పండ్లు వంటివి తిని గడపవచ్చు. సాయంత్రం పూజ జరిపిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు.
అయితే త్రయోదశి నాడు వండని అంటే ఉడికించని పదార్థాలను స్వీకరించి, మరుసటి రోజు వండిన ఆహారం భుజించాలి. అంటే వ్రతం నాడు పక్వపదార్థాలు నిషేధం అని చెబుతారు. ప్రదోషం వ్రతం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి, అపవాదులు దూరమవుతాయి, వ్యాపార వ్యవహారాలలో నష్ట నివారణ జరుగుతుంది.